వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు బెయిల్ రావాలని కోరుతూ కడప పెద్దదర్గాలో ముస్లీం సోదరులు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికుట్రలు చేసినా.. జగన్ బయటకు రావడం ఖాయమన్నారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబుకు పదవీ కాంక్ష తప్ప ప్రజా శ్రేయస్సు పట్టడం లేదన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోనూ జగన్ బెయిల్పై విడుదల కావాలంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలు కొట్టారు. జగన్ కు బెయిల్ రావాలని కోరుతూ భద్రాచలం రామాలయంలో అభిమానులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని ఖమ్మం జిల్లా భద్రాచలం వైఎస్సార్ సీపీ నేతలు, యువనాయకులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రావి వెంకటరమణ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మహానేత వైఎస్సార్ పథకాలు అమలు కావాలన్నా , రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా జగన్ బయటకు రావాలని అభిమానులు ప్రార్ధనలు నిర్వహించారు. వైఎస్ జగన్ బెయిల్పై విడుదల కావాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో ముస్లీం మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గౌరవరం మసీదు నుండి కావలి జెండాచెట్టు మసీదు వరకు పాదయాత్ర చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.