ఇకపై రాష్ట్రంలో అన్నింటికీ ఆధార్‌ను లింకు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖలు విధిగా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయాల్సిందేని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. సచివాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలను మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని శాఖలు మాత్రమే ‘ఆధార్’ను అమలు చేస్తున్నాయని, ఇకపై అన్ని శాఖలూ విధిగా ‘ఆధార్’ను అనుసంధానం చేయాలని కేబినెట్ తీర్మానించినట్లు తెలిపారు. పౌర సరఫరాలు, పెన్షన్లకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధార్‌ను అమలు చేసి సత్ఫలితాలు సాధించాయని చెప్పారు.