భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు నేడు చెన్నైలో అట్టహాసంగా ఆరంభమైయ్యాయి. చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నేటి నుంచి 24 వరకూ నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలో తమిళ సినీ పరిశ్రమ వేడుకలు మొదలవుతాయి. 22వ తేదీ ఉదయం కన్నడ పరిశ్రమ, సాయంత్రం తెలుగు పరిశ్రమకు చెందిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 23వ తేదీ ఉదయం మలయాళ పరిశ్రమ వేడుకలు జరుపుతారు. అదే రోజు సాయంత్రం సీనియర్ నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, మలయాళ నటులు మధుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తారు. తదుపరి వివిధ కళాకారులను సత్కరిస్తారు. 24న పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం జరిగే ముగింపు వేడుకల్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు పాల్గొంటారు.