బ్రహ్మంగారిమఠం : తాను చనిపోయినా.. మరొకరికి జీవితాన్ని ఇవ్వాలని సంకల్పించాడు. తన అవయవాలను దానం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ మద్దిరెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు భోగిరెడ్డి సిద్దారెడ్డి (40) ఈ నెల 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 10వ తేదీన బైక్‌లో కమలాపురం నుంచి ఖాజీపేటకు వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. అతన్ని హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అవయవాలలోని కళ్లు, కిడ్నీలు, గుండెలను దానంగా ఇవ్వడం జరిగిందని సిద్దారెడ్డి తమ్ముడు డోజర్ సిద్దారెడ్డి తెలిపారు. మృతి చెందిన సిద్దారెడ్డికి భార్య, చిన్న పిల్లలైన బాబు, పాప ఉన్నారు.
నేడు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
భోగిరెడ్డి సిద్దారెడ్డి మృతదేహానికి నివాళి అర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి ఆదివారం వస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఎం. రత్నకుమార్‌యాదవ్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు.


