కడప కార్పొరేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మేనమామ అయినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేయడానికి కమలాపురానికి వచ్చిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. రైల్వే ఓవర్ పూర్తి చేయనందుకు సిగ్గుపడాలని తనను మాట్లాడటం సరికాదన్నారు. పులివెందులతో సమానంగా కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, జనార్దన్‌రెడ్డిలా ప్రజల సొమ్ము దోచుకోలేదన్నారు. ఆయన సతీమణి ఇందిరమ్మ వసూల్ రాణిగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. నేషనల్ హైవే నుంచి కమలాపురం లోకి రూ.100 కోట్లతో ఫ్లై ఓవర్ చేపట్టి 90 శాతం పూర్తి చేయడం జరిగిందని, మార్కెట్ యార్డును రూ. కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. అమ్మవారి శాల నుంచి గతంలో 8 అడుగుల రోడ్డు ఉండేదని, దాన్ని విస్తరించి వెడల్పాటి రోడ్డు నిర్మించామన్నారు. ఓపెన్ డ్రైన్లు నిర్మించి ఎక్కడా వరదనీరు నిలవకుండా చర్యలు చేపట్టామన్నారు. తాగునీటికి సంబంధించి కుందూనది నుంచి రూ. 24కోట్లతో పంపింగ్ స్కీం తెచ్చి, 4 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించామన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించడమేగాక రూ.6కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ, రూ.9కోట్లతో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని, నాడు–నేడు ద్వారా అన్ని పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆరు ఆర్లు టెండర్లు పిలిస్తే ఎవరూ రాలేదని, ఆ తర్వాత సేతు బంధన్ స్కీంలో దేశ వ్యాప్తంగా 79 బ్రిడ్జిలు మంజూరు చేస్తే, మన రాష్ట్రంలో 3 మంజూరు చేశారని, అందులో కమలాపురం బ్రిడ్జి మొదటిదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి వల్లే అది సాధ్యమైందన్నారు. అప్పట్లో లోకల్ నాయకులు కమీషన్లు అడగటం వల్ల కాంట్రాక్టర్ చేయలేదని, ఇప్పుడు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ ద్వారా పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది క్రెడిట్ చోరీ తప్పా ఇంకేం కాదన్నారు. కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఏ రోజైనా, ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వస్తారా, ఆయన తండ్రి వస్తారా, మంత్రిగా మీరు వస్తారా చెప్పాలన్నారు. కమలాపురం నియోజకవర్గంలో తండ్రీకొడుకులు ఇసుక, కంకర, మట్టి, బ్రాందీ షాపుల ద్వారా రోజుకు రూ.40లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కర్నూల్ జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మ చేస్తున్న అక్రమ వసూళ్లు అందరికీ తెలుసన్నారు. క్రషర్లనీ ఆపి రూ.8కోట్లు వసూలు చేశారని, డీవియేషన్లు ఉన్నాయని ఓ ఫంక్షన్ హాలు నుంచి రూ.1.40కోట్లు, వేర్ హౌస్ నుంచి రూ.40లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. సొంతంగా మైనింగ్ లేకపోయినా క్రషర్ ఏర్పాటు చేసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. గ్రావెల్, మట్టి, ఇసుక ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని, డా. మహ్మద్ హుస్సేన్ నుంచి రూ.70లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. పవర్ గ్రిడ్, సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని, స్టోర్ బియ్యాన్ని మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. గురివిందగింజ తన నలుపెరగనట్లు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. త్వరలో వీరికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు బంగారు నాగయ్య యాదవ్, ఎస్. వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్ కుమార్, షపీ, ఫయాజ్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజల సొమ్ము దోచుకునే నీవు సిగ్గుపడాలి
మీ భార్య ఇందిరమ్మ
వసూల్‌రాణిగా పేరొందింది
కమలాపురం నియోజకవర్గ అభివృద్దిపై ఏ రోజైనా చర్చకు సిద్ధం
నీవు వస్తావా...మీ ఎమ్మెల్యేనా,
వారి తండ్రా మీ ఇష్టం
మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డిపై
విరుచుకుపడిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి


