కడప ఎడ్యుకేషన్ : కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌గా నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. కడప వి.వి.ఆర్ ఎస్టీయూ భవన్‌లో జరిగిన ఫ్యాప్టో సభ్య సంఘాల కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఫ్యాప్టో చైర్మన్‌గా ఉన్న ఇలియాస్ బాషా ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ప్రస్తుత ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంగమేశ్వరరెడ్డిని ఫ్యాప్టో చైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా సంగమేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికపరమైన, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ఉద్యమాలే శరణ్యమని అన్నారు. గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి లబ్ధి పొంది నేడు ఇచ్చిన హామీలు మరిచి వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా 12వ పీఆర్సిపై అతీగతీ లేదని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉమ్మడి ఉద్యమాలకు అందరనీ కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తామన్నారు.


