కమలాపురం : కమలాపురం పట్టణంలో రైల్వే ట్రాక్‌పై నిర్మిస్తున్న ఆర్‌ఓబీ పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే గేటు సమీపంలో రూ.39 కోట్లతో ఆర్‌ఓబీ నిర్మాణానికి ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డితో కలసి భూమిపూజ చేశారు. అలాగే శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపురం ప్రజల చిరకాల కోరిక నెరవేరనుందన్నారు. ఆర్‌ఓబీ పనులను త్వరితగతిన చేపట్టి ఏడాదిలోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. అరగంటలోనే నాలుగు రైళ్లు వెళ్తున్నాయని, కమలాపురం ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికి రాష్ట్రంలో చాలా రోడ్లు వేశామన్నారు. అలాగే ఖాజీపేట రహదారిలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా మంజూరు చేసి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


