మైదుకూరు : జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 25న బుధవారం పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి బైపాస్ సర్వీస్ రోడ్డు వద్ద పాల వ్యాన్ ఢీకొని ద్విచక్రవాహనంలో వెళుతున్న దువ్వూరుకు చెందిన మొగిలిచర్ల భానుప్రకాష్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్‌పై ఉన్న మరో యువకుడు గంగా ప్రసాద్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ధర్మవరం నుంచి చాపాడు మండల పరిధిలోని ఓ పాల ఫ్యాక్టరీకి పాలను తీసుకొచ్చి తిరిగి వెళుతూ బైక్‌ను ఢీకొన్న పాల వ్యాన్ డ్రైవర్ షేక్ మస్తాన్‌ను సోమవారం శ్రీనగరం వద్ద అరెస్టు చేసి, పాల వ్యాన్‌ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన ప్రకాశం జిల్లా దర్శికి చెందిన డ్రైవర్ మస్తాన్‌పై హత్య కేసుకు సమానమైన సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ రమణారెడ్డి తెలిపారు.


