ఇన్‌ఛార్జి మంత్రి సవిత
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే పీ4 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో ఎంబీకే–10–20–స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంతోపాటు రాష్ట్ర బడ్జెట్ 2026–27 డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగామ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పీ4 కార్యక్రమం ద్వారా జిల్లాలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న పలువురికి మంత్రి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హరిచంద్ర(46) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని అహోబిలాపురానిక చెందిన వెంకటరమణ కుమారుడు హరిచంద్ర ముత్తుకూరు గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా.. ఎర్రిపల్లె గ్రామ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. హరిచంద్ర జేసీబీలు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ శాంతి లాల్ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
లింగాల : లింగాల మండలం దిగువ లింగాల గ్రామానికి చెందిన వెన్నపూస చెన్నకేశవరెడ్డి (48) గత శనివారం ఉదయం 9గంటల నుంచి కనిపించడంలేదని ఆయన భార్య రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం లింగాల బస్టాండులో బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఇంతవరకు ఆచూకీ తెలియడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నకేశవరెడ్డి ఎత్తు 5.5 అడుగులు, ఛామనఛాయ కలిగి ఉంటాడన్నారు. అతను పూర్తిగా నడవలేరని, కర్ర సాయంతో చిన్నగా నడుస్తూ ఉంటాడని, మతి స్థిమితంలేదని, మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నారన్నారు. ఆ వ్యక్తి ఎవరికై నా కనిపిస్తే లింగాల ఎస్‌ఐ 9121100551, రూరల్ సీఐ 9121100549, పులివెందుల డీఎస్పీ 9121100545 నంబర్లకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలోని గడ్డంవారిపల్లెకు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరులోని కడప రోడ్డుకు చెందిన షేక్ సాదక్‌వలీ, కొత్తకొట్టాలుకు చెందిన ఫకృద్దీన్, బద్వేలు రోడ్డుకు చెందిన ఖాజా హుస్సేన్ అనే వారు కార్పెంటర్లు. వీరు సోమవారం బైక్‌పై మండలంలోని ముత్తరాయపల్లెకు చెక్కపని చేసేందుకు వెళుతున్నారు. గడ్డంవారిపల్లె సమీపంలోని బైపాస్ వద్ద వెనుకవైపు నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. ఫకృద్దీన్‌ను ప్రొద్దుటూరుకు, సాదక్‌వలీ, ఖాజా హుస్సేన్‌లను కడప రిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖాజాహుస్సేన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు లేదా తిరుపతికి తీసుకు వెళ్లాల్సిందిగా డాక్టర్లు రెఫర్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


