ఒంటిమిట్టను నియోజకవర్గకేంద్రంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టను నియోజకవర్గకేంద్రంగా ప్రకటించాలి

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

రాష్ట్ర అధికారిక రామాలయం

ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

రాజంపేట : డిలీమిటేషన్‌ ప్రక్రియలో భాగంగా ఒంటిమిట్టను నియోజకవర్గ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం స్ధానిక శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో కలిసి సీతారామ,లక్ష్మణ విగ్రహమూర్తులను దర్శించుకున్నారు. అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను ఎంపీకి వివరించారు. భక్తులకు అభివాదం చేశారు.క్యూలో భక్తులు ఎంపీని ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం ఆలయం బయట ఎంపీ మీడియాతో మాట్లాడారు. డిలీమిటేషన్‌ అనేది కళ్లముందు కనిపిస్తోందన్నారు. ఒంటిమిట్టకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఒంటిమిట్టకు ఉన్న ప్రాముఖ్యత, చరిత్రను ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఆ దిశగా నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండబోతున్నాయన్నారు. ఒంటిమిట్ట నియోజకవర్గ కేంద్రమైతే బాగుంటుందని, ఆదిశగా తాను కూడా ఏకీభవిస్తునని ఎంపీ తమ మనోగతం తెలియచేశారు.

రైళ్ల హాల్టింగ్స్‌పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి

రాష్ట్ర విభజన తర్వాత అధికారిక రామాలయం ఒంటిమిట్ట శ్రీ కోదంరామాలయం గుర్తింపులోకి వచ్చిందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో స్ధానిక ఎంపీ పీవీమిథున్‌రెడ్డి, తాను ఢిల్లీలో ఇది వరకే పలుమార్లు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో అన్ని రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. రాష్ట్ర నలుమూలలే నుంచి కాకుండా, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట రామాలయానికి భక్తులు వచ్చేలా రైళ్ల సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం బ్రహ్మోత్సవాల తరుణంలోనే కాకుండా ఏడాదిపాటు అన్ని రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామాలయ చరిత్రను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, భక్తులకు రైలుప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నామన్నారు.

శ్రీరామచంద్రుని జీవితం ఆదర్శనీయం

శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. తాగ్యానికి, ధర్మానికి మారుపేరు కోదండరాముడన్నారు. ప్రజలు, రైతులు బాగుండాలని కోదండరామున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఏప్రిల్‌ 1న జరిగే దాశరథి కల్యాణోత్సవంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కల్యాణం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. టీటీడీ, ప్రభుత్వం సమన్వయంతో కల్యాణోత్సవంను జయప్రదంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నామన్నారు. ఎంపీతోపాటు ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరిసుధా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్‌, మాజీ మేయర్లు సురేష్‌బాబు, పాకా సురేష్‌, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, జెడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియన్‌ నేత ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ టక్కోలు శివారెడ్డి, మాజీ ఉపమేయరు నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement