● ఏసీపీకి షోకాజ్‌ నోటీసు | - | Sakshi
Sakshi News home page

● ఏసీపీకి షోకాజ్‌ నోటీసు

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

● ఏసీపీకి షోకాజ్‌ నోటీసు

● ఏసీపీకి షోకాజ్‌ నోటీసు

● ఏసీపీకి షోకాజ్‌ నోటీసు

లక్షలు గడిస్తున్న టీపీబీఓలు

కడప కార్పొరేషన్‌: ‘రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లపై నడుస్తుందట’ఈ సామెత కడప నగరపాలక సంస్థకు అతికినట్లు సరిపోతుంది. పట్టించుకునే వారు లేకపోవడంతో కార్పొరేషన్‌లో కొందరు అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కీలక విభాగాలైన రెవెన్యూ, ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో ఇంటి పన్ను వేయాలన్నా, ఖాళీ జాగాకు పన్ను వేయాలన్నా, ఆస్తిపన్నులో పేరు ఒకరి నుంచి మరొకరికి మ్యూటేషన్‌ చేయాలన్నా డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎవరైనా తమ పాత ఇంటిని పడగొట్టుకుంటే ఎప్పుడైతే పడగొట్టారో అప్పటి నుంచి ఖాళీ జాగా(వీఎల్‌టీ)కు పన్ను వేయాలి. కానీ ఇప్పుడు ఇంటిని కూల్చివేస్తే రెండున్నర సంవత్సరాలు వెనక్కిపోయి పన్నులు వేస్తున్నారు. కొత్తగా వేసే ఇంటి పన్నులకు కూడా ఇలాగే వేస్తున్నారు. దీంతో రూ. లక్షల్లో కార్పొరేషన్‌కు చెల్లించే బదులు అధికారులకు మామూళ్లు ఇస్తే సరిపోతుంది కదా...అని ప్రజలే లంచాలు ముట్టజెప్పే పరిస్థితిని కల్పిస్తున్నారు. కడపలో చాలా గ్రామ పంచాయితీలు విలీనమయ్యాయి. గ్రామ నత్తం భూములకు లింకు డాక్యుమెంట్లు ఉండే అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పాత మున్సిపల్‌ ఏరియాలో వెస్ట్‌–1, నార్త్‌–1, సౌత్‌–1, చెమ్ముమియ్యాపేట, ఇందిరానగర్‌, పుట్లంపల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్‌ఐలు, అడ్మిన్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వార్డు అడ్మిన్‌ సెక్రటరీలకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించారు. వారు మున్సిపల్‌ నిబంధనలు అర్థం చేసుకోలేక, అవగాహన లేక ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని విమర్శలొస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ సెక్రటరీలను ఇన్‌చార్జి టీబీబీఓలుగా, ఎమినిటీస్‌ సెక్రటరీలను ఇన్‌చార్జి ఏఈలుగా నియమిస్తూ ఆయా శాఖలే ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ అడ్మిన్లను రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లుగా నియమించాలని సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు జారీ చేయకపోయినా కడప నగరపాలక సంస్థలో మాత్రమే కొందరిని ఉన్నత స్థానంలో కూర్చొబెట్టినట్లు తెలుస్తోంది. గతంలో రెగ్యులర్‌ ఉద్యోగులే ఆర్‌ఐలుగా విధులు నిర్వహించేవారు. ఫిర్యాదులు వస్తే సస్పెండ్‌ చేస్తారన్న భయంతో వారు కూడా బాధ్యతతో పనిచేసేవారు. కానీ సచివాలయ వ్యవస్థ వచ్చాక సంఖ్యాబలం ఉండటంతో కొందరు సెక్రటరీలు తప్పు చేసి కూడా చేయలేదని బుకాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఉన్నతాధిరకారులకు డబ్బులు సంపాదించి పెట్టేందుకు ఉపయోగపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

● పబ్లిక్‌ హెల్త్‌ సెక్షన్‌ పరువు గంగపాలవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో క్లాప్‌ యూజర్‌ చార్జీలు వసూలు చేయొద్దని ప్రభుత్వం చెప్పినప్పటికీ కొందరు సెక్రటరీలు, సిబ్బంది అనధికారికంగా యూజర్‌ చార్జీలు వసూలు చేసి, వాటిని కార్పొరేషన్‌కు చెల్లించకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారు.

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అసిస్టెంట్‌ సిటీప్లానర్‌గా పనిచేస్తున్న ఐ.నాగరాజుకు మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రారెడ్డి శుక్రవారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. స్థానిక జార్జిక్లబ్‌ ఎదురుగా ఉన్న వెల్లాల టిఫెన్‌ సెంటర్‌కు వెళ్లారు. తన మిత్రుడుతోకలిసి టిఫెన్‌ సెంటర్‌కు వెళ్లిన ఏసీపీ 1/2 కాఫీ ఇవ్వాలని అడిగాడు. తమ షాపులో ఆ సౌకర్యం లేదని షాపు యజమాని తిరస్కరించాడు. దీనిపై ఆగ్రహించిన ఏసీపీ తన మనుషులతో జేసీబీని తీసుకొచ్చాడు. టిఫెన్‌ సెంటర్‌ ముందు ర్యాంప్‌ డ్రైనేజీ కాలువపై నిర్మించారని తొలగించాలని ఏసీపీ తెలిపాడు. దీంతో షాపు యజమాని మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం కలెక్టర్‌ వరకు వెళ్లింది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు కమిషనర్‌ రవిచంద్రారెడ్డి ఏసీపీకి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘ముదుర్లు’

మామూళ్లకు అలవాటు పడిన అధికారులు

చోద్యం చూస్తున్న అవినీతి నిరోధక శాఖ

టౌన్‌ప్లానింగ్‌లో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సివిస్‌ సిస్టమ్‌ వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు, టీపీబీఓల పాలిట వరంలా మారింది. కొత్తగా ప్లాన్‌ తీసుకోవాలన్నా, ఇంప్రూవ్‌మెంట్‌ చేయాలన్నా ఎల్‌టీపీలు ప్లాన్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్లానింగ్‌ సెక్రటరీలు వాటిని వెరిఫై చేస్తారు. టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారులతో పనిలేకుండానే ప్లాన్లు వచ్చేస్తున్నాయి. దీంతో టీపీబీఓలు, కొందరు ప్లానింగ్‌ సెక్రటరీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం కూడా వీరికి కాసులు కురిపిస్తోంది. కడపలోని వైవీ స్ట్రీట్‌, చిన్నచౌకు వంటి ప్రాంతాల్లో చాలా వాటిని బీపీఎస్‌గా చూపి ఒక్కో బిల్డింగ్‌కు లక్ష నుంచి రెండు లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చోద్యం చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాాలంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement