పన్నుల్లో కిరికిరి !
డిప్యూటీ ఎంపీడీఓ ఏమున్నారంటే...
● కమర్షియల్ భవనాలకు హౌస్‌ట్యాక్స్
● పంచాయతీ ఆదాయానికి గండి
రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో కమర్షియల్ క్లాంపెక్స్‌కు పన్నుల విధింపులో అవతవకలు చోటుచేసుకున్నాయనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళుతున్నాయి. పట్టణంలోకి కూచివారిపల్లె, ఊటుకూరు, పెద్దకారంపల్లె పంచాయతీలు విస్తరించి ఉన్నాయి. వీటి హద్దుల మేరకు పట్టణంలో కీలకమైన ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు కొంతవరకు పంచాయతీల పరిధిలో ఉన్నాయి.అయితే పన్నులు మాత్రం పంచాయతీలకు వర్తిస్తున్నాయి. రాజంపేట బైపాస్ తిరుపతి వైపు, రైల్వేకోడూరు వైపు, మన్నూరు వైపు ఇలా పట్టణంలో కొన్ని ప్రాంతాలు పంచాయతీ పరిధిలో ఉండటంతో అక్రమార్కులకు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది.
పట్టణంలోని రైల్వేకోడూరు మార్గంలో ఉన్న పక్కా కమర్షియల్ భవనాలకు ఇంటి పన్ను రాబడుతున్న సంఘటన కూచివారిపల్లె పంచాయతీలో వెలుగుచూసింది. ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓపై పచ్చనేతల వీరంగంతో పన్నుల విధింపులో అవకతవకలు బహిర్గతమయ్యాయి. ఇటీవల రాజంపేట ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ అస్రఫ్‌అలీని కొంతమంది పచ్చనేతలు బెదిరించడం, పంచాయతీలో జరిగిన అవకతవకలను బలపరుస్తోంది. ఇప్పుడు ఈ పంచాయితీ నిర్వహణ వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. పైగా పంచాయతీరాజ్ కమిషనరు, డీపీఓ, డీఎల్‌డీఓకు ఫిర్యాదులు వెళ్లాయి.
పంచాయతీ కార్యదర్శికి నోటీసు..
రైల్వేకోడూరు రహదారిలోని కమర్షియల్ భవనాన్ని నివాస భవనంగా గుర్తించి పన్ను వసూలు చేసుకుంటున్నారని పీజీఆర్‌ఎస్‌లో కూచివారిపల్లె గ్రామానికి చెందిన పోలూరు జయమ్మ అనే మహిళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ ఎంపీడీఓ అస్రఫ్‌అలీ కార్యదర్శి కమలాదేవికి నోటీసు జారీ చేశారు. కూచివారిపల్లె పంచాయతీ పరిధిలో గల ఇంటికి పన్ను గత సంవత్సరం నాన్ కమర్షియల్ ట్యాక్స్, కింద పంచాయితీకి జమచేశారు.కానీ పట్టణంలో ఉన్న ఈ భవనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిర్వహిస్తున్నారు. పక్కా కమర్షియల్‌ను నాన్ కమర్షియల్‌గా పన్ను ఏవిధంగా వసూలు చేస్తారు? ఇందుకు సంబంధించి డాక్యుమెంట్స్‌తో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కూచివారిపల్లెకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ కూడా పంచాయితీ ఆదాయం గురించి వాకబు చేసినట్లు సమాచారం. గతంలో పీజీఆర్‌ఎస్‌లో గాంధీనగర్ డోర్ నంబరు కేటాయింపు వ్యవహారంపై ఫిర్యాదులు వెళ్లాయి.
కూచివారిపల్లె పంచాయతీ పరిధిలో ఇంటిపన్ను వ్యవహారంలో అవకతవకలు.. పట్టణం పరిధిలోకి విస్తరించిన పంచాయతీలకు చుట్టుకుంటోంది. పట్టణంలోని రైల్వేకోడూరు రహదారి ప్రాంతంలో దాదాపు అన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఇది ఖరీదైన ప్రాంతంగా కొనసాగుతోంది. దీంతో పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం రావాలి. కానీ ఆ విధమైన పరిస్థితులు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరి ఫిర్యాదుతో ఇప్పుడు ఇంటిపన్నులు విధింపులో అవకతవకలు జరిగాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రాజంపేట బైపాస్ రహదారిలో తిరుపతివైపు కూడా అనేక భవనాలు, స్థలాలు ఊటుకూరు పంచాయతీ పరిధిలోకి వస్తాయి.
అనుడా అనుమతి లేకుండానే...
అన్నమాచార్య అర్బన్ డెవలప్‌మెంట్(అనుడా) అనుమతి లేకుండానే కూచివారిపల్లె, ఊటుకూరు, పెద్దకారంపల్లె పంచాయతీలు రాజంపేట పట్టణం పరిధిలోకి నిర్మాణాలు వెలుస్తున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. పంచాయతీలు కావడంతో కమర్షియల్ భవనాలకు ఇంటి పన్ను, విద్యుత్ కనెక్షన్లు వస్తున్నాయి. చేతివాటంతో చకచకా ఇవి జరిగిపోతున్నాయి. చాలావరకు అనుమతి లేకుండా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్లాన్ అప్రూవుల్ కూడా అనుడా నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు పాటిస్తున్న నిబంధనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఎదీ ఏమైనప్పటికి కొంతమంది కార్యదర్శుల చేతి వాటం వల్ల పంచాయతీల ఆదాయానికి భారీగానే గండిపడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో ఉన్న అవి పంచాయతీకి సంబంధించిన ప్రాంతాలు కాబట్టి మున్సిపాలిటీ అటువైపు తొంగిచూడదు. అయితే పురపాలిక సేవలు మాత్రం ఉంటాయని స్థానికులు చెపుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తోంది కమర్షియల్ భవనం అనుకుంటే...పప్పులో కాలిసేనట్లే...ఇది నివాసభవనం అని కూచివారిపల్లె పంచాయతీ గుర్తించిందంటా..ఇంటిపన్ను కూడా వసూలు చేస్తోందంటా..ఇప్పుడు ఈ భవనం వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా ఇంటిపన్ను విధించారో ఆయనకే తెలియాలి. రాజంపేట పట్టణంలోకి చొచ్చుకొచ్చిన పంచాయతీల పరిధిలో పన్ను విధింపు లీలలు అనేకం ఉన్నాయి. ఇటీవల పచ్చనేతలు డిప్యూటీ ఎంపీడీఓపై వీరంగం సృష్టించడానికి కారణం వెనుక అసలు వ్యవహారం బయటికిపొక్కింది. పట్టణంలో పంచాయతీపాలనలో పన్నులు, బిల్డింగ్‌ప్లానింగ్ లాంటి వాటి విషయంలో అడ్డగోలు అనుమతులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కూచివారిపల్లె పంచాయతీ కార్యదర్శి కమలాదేవికి నోటీసు ఇచ్చామని డిప్యూటీ ఎంపీడీఓ అస్రఫ్ అలీ వివరణ ఇచ్చారు. ఇదే నోటీసు పంచాయతీరాజ్ కమిషనరు, డీపీఓలకు పంపామన్నారు. అలాగే పోలరపు లక్షుమయ్య అనే వ్యక్తి పేరుతో డీబీఎన్ పల్లె డోర్ నంబరు4/350, 4/351 ఉన్న రెసిడెన్సీల కింద ఉన్న పన్ను కమర్షియల్‌గా మారుస్తానని జనవరి 22లోపు రాతపూర్వకంగా ఇస్తానని తెలియచేసిందన్నారు. అయితే ఇంతవరకు ఎటువంటి రికార్డులు సబ్‌మిట్ చేయలేదని ఎంపీడీఓ స్పష్టంచేశారు.
పన్నుల్లో కిరికిరి !


