హెచ్‌ఐవీ నిర్ధారణలో నిర్లక్ష్యంపై విచారణ
ప్రొద్దుటూరు క్రైం : హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో జరిగిన నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి (ఏపీసాక్స్) ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు బుధవారం విచారణ చేపట్టారు. ఐదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఒక గర్భిణీకి హెచ్‌ఐవీ లేకున్నా రిపోర్టులో పాజిటివ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్లక్ష్య ఉదంతంపై పత్రికల్లో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పదించి విచారణకు ఆదేశించారు. ఏపీసాక్స్ జాయింట్ డైరెక్టర్ అంకివీడు ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌వర్మలు జిల్లా ఆస్పత్రికి చేరుకొని కాన్ఫరెన్స్ హాల్‌లో విచారణ చేశారు. నాడు విధుల్లో ఉన్న వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, పీపీసీటీసీ, మెడికల్ ఆఫీసర్, నాటి మెడికల్ సూపరింటెండెంట్‌లను అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు. అలాగే బాఽధితులను కూడా పిలిపించి మాట్లాడారు.
ఘటన పూర్వాపరాలు..
ప్రొద్దుటూరులోని మోడంపల్లెకు చెందిన గర్భిణీ 2020 అక్టోబర్ 14న ప్రసవం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి వెళ్లగా హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు వైద్యాధికారులు తప్పుడు రిపోర్టు ఇచ్చారు. తన భార్యకు హెచ్‌ఐవీ లేదని మళ్లీ ఒకసారి టెస్ట్ చేయాలని భర్త ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. హడావుడిగా పరీక్షలు చేసిన అనంతరం నిమిషాల వ్యవధిలోనే ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు ఏర్‌టీ ఆన్‌లైన్‌లో చేర్చారు. వాస్తవానికి ఒక సారి పాజిటివ్‌గా ఫలితం వస్తే వెంటనే ఒక నిర్ధారణకు రాకుండా తదుపరి వివిధ రకాల పరీక్షలు చేయాల్సి ఉంది. ఇలా రెండు మూడు సార్లు పరీక్షలు చేసినా పాజిటివ్ వస్తే చివరగా వచ్చిన రిజల్ట్‌నే పరిగణలోకి తీసుకుంటారు. అయితే బాధిత గర్భిణీకి ఒక సారి మాత్రమే పరీక్షలు నిర్వహించిన అనంతరం దాన్నే తుది ఫలితంగా భావించి పాజిటివ్ కేసుగా నిర్ధారణ చేశారు. దీంతో బాధిత మహిళా కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. అయితే సదరు బాధిత మహిళ 2025లో మరో బిడ్డను ప్రసవించింది. ప్రసవానికి ముందు ప్రైవేట్ హాస్పిటల్‌లో నిర్వహించిన పరీక్షల్లో హెచ్‌ఐవీ నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె భర్త ఇదే పరీక్షలను రెండు, మూడు సార్లు నిర్వహించినా నెగిటివ్‌గా వచ్చింది. దీంతో తన భార్యకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్‌కు భర్త ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాలపై జిల్లా ఆస్పత్రిలో తిరిగి మహిళకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారు వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై కోర్టును ఆశ్రయించారు. తన భార్య పేరును ఏఆర్‌టీ ఆన్‌లైన్‌లో నుంచి తొలగించాలని పలుమార్లు వైద్యాధికారులను విన్నవించినా వారు పట్టించుకోలేదు. అది సాధ్యం కాదు.. మా చేతుల్లో లేదంటూ కాలయాపన చేస్తూ వచ్చారు.
ఐదేళ్లు నరకం అనుభవించాం..
విచారణలో భాగంగా బాధిత మహిళ, ఆమె భర్త జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆన్‌లైన్‌లో పేరును తొలగించాలని ఎన్నో సార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌ఐవీ పాజిటివ్ రిపోర్టు రావడంతో నాటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లలేదని వారు తెలిపారు. ప్రతి సారి ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లగా రూ. లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన అనంతరం తమకు ఇద్దరు పిల్లలు జన్మించినట్లు తెలిపారు. తాము నివాసం ఉంటున్న వీధిలో, బంధువులు తమ పట్ల చిన్నచూపు చూశారన్నారు. అవమాన భారంతో ఐదేళ్ల పాటు నరయాతన అనుభవించినట్లు తెలిపారు. తమ పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఆన్‌లైన్‌లో పేరును తొలగిస్తాం
ఏఆర్‌టీ ఆన్‌లైన్‌లో నుంచి బాధిత మహిళ పేరును తొలగిస్తామని ఏపీసాక్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌వర్మ తెలిపారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీసాక్స్ పీడీ ఆదేశాల మేరకు విచారణకు వచ్చామన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది మొత్తం 20 మందిని విచారణ చేసినట్లు తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.
అధికారుల ముందు హాజరైన
వైద్యాధికారులు, సిబ్బంది
విచారణ కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు విచారణకు హాజరైన బాధిత దంపతులు
హెచ్‌ఐవీ నిర్ధారణలో నిర్లక్ష్యంపై విచారణ


