ప్రభుత్వం ఇచ్చే డబ్బు హాస్టళ్ల మెనూకు సరిపోవడం లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఇచ్చే డబ్బు హాస్టళ్ల మెనూకు సరిపోవడం లేదు

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

ప్రభుత్వం ఇచ్చే డబ్బు హాస్టళ్ల మెనూకు సరిపోవడం లేదు

ప్రభుత్వం ఇచ్చే డబ్బు హాస్టళ్ల మెనూకు సరిపోవడం లేదు

ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి

మైదుకూరు : సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వమిచ్చే డబ్బుకు అక్కడి మెనూకు సరిపోవడం లేదని ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం మైదుకూరులోని జెడ్పీ బాలుర, బాలికల హైస్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లకు ఇచ్చే డబ్బు 2023 నాటి ధరలను బట్టి ఉందన్నారు. ఈ మూడేళ్లలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని వాటికి అనుగుణంగా పాత రేట్లు సరిపోవడం లేదని పేర్కొన్నారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా సొమ్మును పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామని తెలిపారు. తనిఖీకి వెళ్లిన చోట ఉన్న అవకతవకలను, బాగున్న వాటిని సోషల్‌మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. వాటిని చూసి లోటుపాట్లను సరిదిద్దుకుంటే బాగుంటుందన్నారు. సంక్షేమ హాస్టళ్లు దారుణంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 4.26 కోట్ల మందికి 5 కిలోల వంతున ప్రభుత్వం బియ్యం ఇస్తోందని, వాటిని కొందరు తినలేక అమ్ముకుంటున్నారని అన్నారు. అందువల్ల మంచి బియ్యం ఇవ్వడమా లేదంటే బియ్యం బదులుగా డబ్బు ఇవ్వడమా చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా బాలుర హైస్కూల్‌ హెడ్మాస్టర్‌ ఇలియాస్‌ అహ్మద్‌, ఎస్టీయూ నాయకుడు వై.వెంకటసుబ్బయ్య, గోశెట్టి రామమోహన్‌, ఆవుల శ్రీనివాసులు పుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సత్కరించారు.

జిల్లాలోని సగిలేరు గురుకుల పాఠశాలలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ ప్రతాప్‌రెడ్డి గురుకుల పాఠశాలల వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల సమన్వయకర్త సి.ఉదయశ్రీని ఆదేశించారు. తోట్లపల్లె గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య ఉందన్నారు. పాఠశాలలో కొత్త బోరు వేయించాలని సూచించారు.

విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలి

చాపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చిత్తా విజయ్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన చాపాడులోని జీఏఎస్‌ జెడ్పీ హైస్కూల్‌, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం అందించాల్సిన భోజన వసతిని తనిఖీ చేసి.. సూచనలు చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ఉప్మా బదులుగా ఉగ్గాని పెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ నాగలక్ష్మికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమాకుమారి, హైస్కూల్‌ హెచ్‌ఎం వెంకటలక్ష్మి, టీడీపీ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

దువ్వూరు : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని పుల్లారెడ్డిపేటలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతోపాటు పుల్లారెడ్డిపేటలోని జెడ్పీ హైస్కూల్‌, ఎస్సీ హాస్టల్‌, దువ్వూరులోని అంగన్‌వాడీ కేంద్రాలను, రేషన్‌ షాప్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ రమాదేవి, తహసీల్దార్‌ సంజీవరెడ్డి, చాపాడు సీడీపీఓ ముంతాజ్‌ బేగం, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు వరలక్ష్మి, కళావతి, సౌజన్య, విద్యాశౠఖ, సాంఘిక సంక్షేమ శాఖ, సివిల్‌ సప్‌లై, తూనికలు కొలతల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement