విశ్వాసానికి మారు పేరు శునకాలు
ప్రొద్దుటూరు : ఈ సృష్టిలో విశ్వాసానికి మారు పేరు శునకాలకు మించినవి లేవని శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ ఆర్‌వీ సురేష్‌కుమార్ తెలిపారు. స్థానిక గోపవరం సమీపంలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య కళాశాలలో బుధవారం శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అనిమల్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ వారి ఆధ్వర్యంలో డాగ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో సాధారణంగా నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారని, తొలిసారి ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కాలక్రమేణా కుక్కలకు సంబంధించి ప్రొద్దుటూరు కళాశాలలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు నిపుణులు ఉన్నారని తెలిపారు. బఫెలో రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.ఆనందరావు మాట్లాడుతూ శునకాలను కాలభైరవుడిగా పిలిచేవారన్నారు. మనకు కనిపించని కొన్ని అదృశ్య దృశ్యాలు కనిపించడం వల్లే శునకాలు ఎక్కువగా అరుస్తుంటాయని అన్నారు. కుక్కలకు సంబంధించిన సైలెవాలో విషం ఉంటుందని తెలిపారు. కుక్కల వల్ల మనుషులకు లెప్టో సైరోసిస్, రాబీస్ వ్యాధులు వస్తాయని చెప్పారు. మనుషులు జాగ్రత్తగా మెలగాలని సూచించారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ డాక్టర్ ఎల్.గీతప్రియ మాట్లాడుతూ 20 ఏళ్లపాటు తాము కూడా కుక్కను పెంచుకుని చివరికి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా చేశామన్నారు. మనుషులు ఎక్కువగా కుక్కలతోనే సహచర్యం చేస్తారని, జబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐఎస్‌డీపీ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ పి.రమణారెడ్డి మాట్లాడుతూ ర్యాబీస్ వ్యాధి వచ్చిన తర్వాత పది రోజులకు మించి బతికిన వారు ప్రపంచలోనే లేరని అన్నారు. పిచ్చి పట్టిన కుక్కలతోజాగ్రత్తగా ఉండాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ కుంతలదేవి, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ డి. ఇందిర, సీహెచ్ వెంకటశేషయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న డాగ్ షో
ప్రొద్దుటూరులో తొలి మారు నిర్వహించిన డాగ్ షోకు స్పందన లభించింది. శునకాల యజమానులు తమ కార్లలో, ద్విచక్రవాహనాల్లో 100 శునకాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. ప్రదర్శనలో ఉత్తమ శునకాలకు బహుమతులు పంపిణీ చేశారు.


