బీజేపీ X టీడీపీ!
నియామకాలు హోల్డ్‌లో ఉంచాం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ‘కూటమి’లోని లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సర్కార్‌లో భాగస్వాములైనా క్షేత్రస్థాయిలో పట్టుకోసం ఆయా వర్గాలు కుస్తీ పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేనల కంటే తమదే పెత్తనం ఉండాలనే తపన పచ్చ పార్టీ నేతల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు పనులు, ప్రభుత్వ నియామకాలపై ఎక్కడికక్కడ అంతర్గత విభేదాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా ఆశా వర్కర్స్ నియామకంలో కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. బీజేపీ నేతలకు అనువైన వారి ఎంపికను టీడీపీ పెద్దలు జీర్ణించుకోలేకున్నారు. ‘నా నియోజకవర్గంలో బీజేపీ నేతల బంధువులకు ఎలా ఇస్తారం’టూ ఓ ఎమ్మెల్యే యంత్రాంగంపై మండిపడ్డారు.
● జిల్లాలో 40 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో 55 మంది ఆశా వర్కర్ల నియామకానికి గత ఏడాది జూలై 5న నోటిఫికేషన్ జారీ అయ్యింది. దాదాపు 5వందల మందికి పైగా ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 55 మందిని మెరిట్ లిస్టు ప్రకటించి, వారందర్నీ ఆయా పీహెచ్‌సీ పరిధిలో నియామకాలు చేపట్టాల్సిందిగా ఆర్సీ నెంబర్.ఎస్‌పీఎల్/ఆశా/2026 ద్వారా జనవరి 29న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడికక్కడ ఎంపికై నా ఆశా వర్కర్లు జాయినింగ్ రిపోర్టు కూడా సబ్మిట్ చేశారు. ఈలోగా మైదుకూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు ఎలా ఎంపికయ్యారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు అధికారులను నిలదీశారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఆయా పీహెచ్‌సీల పరిధిలో ఆశా వర్కర్లను చేర్చుకోవద్దంటూ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే బెదిరింపులకు నీళ్లు నమిళిన అధికారులు ఒక్కమారుగా మెరిట్ లిస్టును మరుగునపడేశారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
చెంతకు చేరిన వ్యవహారం
జిల్లాలో ఆశా వర్కర్ల నియామకం వ్యవహారం బీజేపీ నేతల ద్వారా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెంతకు చేరింది. ఓ ఎమ్మెల్యే నియామకాలకు అడ్డుతగలడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. జిల్లాలో ఆయా పీహెచ్‌సీలల్లో ఎంపికై న ఆశా వర్కర్లు జాయినింగ్ రిపోర్టు ఇచ్చినప్పటికీ అవన్నీ హోల్డ్‌లో పెట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్క మైదుకూరు కారణంగా జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో పడ్డాయని మంత్రి సత్యకుమార్ చెంతకు జిల్లా బీజేపీ నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. అదేంటీ అలా ఎలా అడ్డుకుంటారంటూ మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని బీజేపీ నేతలకు భరోసా ఇచ్చారనే కానీ, ఇప్పటికీ జాయినింగ్ రిపోర్టులను కొనసాగించలేదు. చాపాడు, మైదుకూరు మండలాల్లో బీజేపీ నేతలకు సన్నిహితులు, బంధువులు ఎంపిక కావడమే సమస్యకు అసలు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆస్థానాలల్లో బీజేపీ సన్నిహితులు కాకుండా టీడీపీ వర్గీయులు సిఫార్సులు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సదరు ఎమ్మెల్యే మంకుపట్టుపట్టినట్లు సమాచారం.
నిబంధనలకు అనుగుణంగానే ఆశా వర్కర్లను ఎంపిక చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. తాము విడుదల చేసింది కేవలం మెరిట్ లిస్టేనని..నియామకాలు కాదని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలల్లో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు కదాని ప్రశ్నిస్తే, వెంటనే అవన్నీ హోల్డ్‌లో ఉంచామని చెప్పడం విశేషం.
ఆశా వర్కర్స్ నియామకంపై టీడీపీ ఎమ్మెల్యే మోకాలడ్డు
గత ఏడాది జూలైలో 55 పోస్టులకు నోటిఫికేషన్ జారీ
టీడీపీ సిఫార్సు లేకుండా బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఎలా?
జాయినింగ్ రిపోర్టు చేయకుండా అడ్డుకున్న వైనం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెంతకుచేరిన వ్యవహారం


