ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
కడప సెవెన్‌రోడ్స్: కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విఽధించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. బుధవారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిందన్నారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోలు బాంబులతో దాడులు, విధ్వంసాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాజ్యాంగం స్థానంలో తన రెడ్‌బుక్ పాలన అమలు చేస్తూ కొత్త సంస్కృతికి తెర తీశారన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, రోజా, విడుదల రజని తదితరులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని తెలిపారు. నిందితులపై నామమాత్ర సెక్షన్లతో కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిలు మంజూరు చేసి పంపుతున్నారన్నారు. ప్రజాస్వామిక వాదులు ఈ చర్యలను ఖండించాలని కోరారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సిట్ ఏర్పాటు చేసి తనకు అనుకూలంగా నివేదిక తెప్పించుకుని వైఎస్సార్ సీపీ నేతలను కేసుల్లో ఇరికించాలని చూశారన్నారు. వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టే సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. సిట్ నివేదిక నేపధ్యంలో దాడులు చేయించడం ద్వారా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పాకా సురేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరంజన్‌రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం స్థానంలో రెడ్‌బుక్ పాలన
కేంద్రం తక్షణమే స్పందించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుపి.రవీంద్రనాథ్‌రెడ్డి


