విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్‌రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్‌ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు.
కడపలో చైన్ స్నాచింగ్
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రామరాజుపల్లెలో ఆదివారం మధ్యాహ్నం పందిళ్లపల్లి పద్మావతి అనే మహిళ మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్‌తో పాటు రెండు కాసుల బంగారు చైన్‌ను గుర్తుతెలియని వ్యక్తి వచ్చి లాక్కెళ్లాడు. రామరాజుపల్లికి చెందిన పద్మావతి తమ బంధువుల ఇంటికి సీమంతం ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా సచివాలయం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బాధితురాలి తల వెనుక భాగాన కొట్టి ఆమె మెడలోని చైన్‌ను లాక్కెళ్లాడు. చైన్‌ను లాక్కున్న వెంటనే దూరంగా పరుగు తీసి, వేరే వ్యక్తితో కలిసి మోటార్‌బైకులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె మెడలోని రోల్డ్ గోల్డ్ చైనుతోపాటు రెండు కాసుల బంగారు చైన్‌ను నిందితుడు లాక్కెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తులసి నాగ ప్రసాద్ తెలిపారు.
గుప్తనిధుల కోసం
తవ్వకాలు
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు.
అరుదైన వన్య ప్రాణుల
స్మగ్లర్లు అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్‌కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్‌కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్‌లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


