తొలి తెలుగు శాసనానికి విశ్వఖ్యాతి
కడప ఎడ్యుకేషన్ : కలమల్లలోని తొలి తెలుగు శిలాశాసనానికి విశ్వఖ్యాతి తీసుకువచ్చేలా కృషి చేస్తామని, భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ, స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కేంద్ర గ్రంథాలయంలో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ సౌజన్యంతో డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) శతజయంతి (1925–2025) సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలుగు శిలా శాసనం‘ నమూనా (రెప్లిక) స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఇమ్మణ్ణి దీపా వెంకట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలుగు భాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నా రు. తన తండ్రి గారి జిల్లా పర్యటన అనంతరం కలమల్ల తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తమ ట్రస్టు ద్వారా సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికి ఉచిత విద్యా సదుపాయాలు, ఆరు లక్షల మందికి పైగా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు త్రివిక్రమ్ పూల మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని, తెలుగు శిలా శాసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే సత్కార్యంలో భాగస్వాములైన స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా వెంకట్ సేవలు అమూల్యమైనవన్నారు. కడప జిల్లాలో వెలసిన మొదటి తెలుగు శిలాశాసన నమూనాను సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ మాట్లాడుతూ సామాజిక సేవకు మారుపేరైన దీపా వెంకట్ భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తనయ అన్న గుర్తింపు మాత్రమే కాక ఆయన మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ మేనేజింగ్ ట్రస్టీగా సామాజిక సేవలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్, కలమల్ల ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు వర్మ వంశీకుడు పీవీఎల్‌ఎన్ రాజు, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు డాక్టర్ జి.పార్వతి మాట్లాడారు.
ఈ సందర్భంగా అతిథులు సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాత్రాలను తిలకించారు. గ్రంథాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ
దీప వెంకట్


