వైఎస్సార్‌సీపీ దళిత నాయకునిపై టీడీపీ నాయకుల దాడి
ఖాజీపేట : తుడుమలదిన్నె గ్రామం దళితవాడకు చెందిన చాట్ల విజయభాస్కర్ (38)పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడికి దిగారు. అతని వద్ద ఉన్న మొబైల్‌ఫోను, డబ్బును లాక్కున్నారు. దీంతో బాధితుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.చాట్ల బాలరాజు వైఎస్సార్‌సీపీలో దళిత సంఘం నాయకునిగా ఉంటున్నాడు. తుడుమలమదిన్నె గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చందా శ్రీనివాసులరెడ్డి ఫోన్ చేసి నువ్వు మా గ్రామంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ కులం పేరుతో, కుటుంబ సభ్యులను సైతం తిట్టాడు. ఫోన్ సంభాషణ రికార్డింగును ఖాజీపేట సీఐ వంశీధర్‌కు వినిపించి ఫిర్యాదు చేసేందుకు బాధితుడు స్టేషన్‌కు వెళ్లాడు. సీఐ న్యాయం చేస్తానని చెప్పడంతో వెనుదిరిగాడు.
పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు చందా శ్రీనివాసులరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సంతోష్‌లు బైక్‌పై ఉన్న విజయభాస్కర్‌ను ఈడ్చి తీవ్రంగా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు వీపీ రాఘవరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని బాధితునికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.బాధితుడు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.


