ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ప్రొద్దుటూరు : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంజా సోమశేఖర్‌రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు. గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తూ మెరుగైన జీతభత్రాలతో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు జీఓ ఎంఎస్ నంబర్ 114ను అమలు చేసి వారి సర్వీసును క్రమబద్దీకరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు గరుడాచలం, జనరల్ సెక్రటరీ జీఎన్ సాయికుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నాగేంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, దివాకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
హైందవ సంస్కృతిని పరిరక్షించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : హైందవ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వేదాంత గీత శివం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానందా స్వామిజీ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక బొల్లవరం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి వరకే కులం అని గడప దాటితే అందరూ హిందువులనే భావన అందరిలో రావాలన్నారు. శివదర్శనానంద స్పిరిచ్యువల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శివదర్శనానంద సరస్వతీ మాతాజీ హిందువులంతా కలిసికట్టుగా జీవించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, హిందూ సమ్మేళన సమితి సమన్వయకర్త డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, హిందూ ధర్మం గురించి వివరించారు. కార్యక్రమంలో సమ్మేళనం సమన్వయకర్త సుధాకర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, హిందువులు తదితరులు పాల్గొన్నారు.
రెండు ఆటోలు ఢీకొని
ఇద్దరికి గాయాలు
లింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు.
కల్వర్టును ఢీకొని ఇద్దరి దుర్మరణం
రాయచోటి టౌన్ : రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలోని యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద పల్స్‌ర్ బైక్‌పై మాధవరం గ్రామం వడ్డెపల్లెకు చెందిన రేపన లక్ష్మీప్రసాద్(18) అలియాస్ ప్రతాప్, వెంకటసాయి కుమార్ (25)లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మాధవరం వడ్డెపల్లె నుంచి రాయచోటికి సొంత పనుల నిమిత్తం వస్తున్న సమయంలో యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకటసాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీప్రసాద్‌ను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి


