జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలకు పూర్తి న్యాయం
కడప కార్పొరేషన్ : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2.0 పాలనలో పార్టీ కార్యకర్తలకు పూర్తిగా న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. ఆదివారం అక్కాయపల్లె 47వ డివిజన్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రజలకు మేలు చేయకపోగా పేద, మధ్య తరగతి వర్గాలకు నష్టం కలిగించేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పేరుతో నెల రోజులు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించామని, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంజద్‌బాషా మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కడప శాసన సభ్యురాలు కుర్చీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇసుక, మట్టి, వైన్ షాపులు, వెంచర్ల నుంచేగాక తోపుడు బండ్ల వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్‌లో అనేక అభివృద్ధి పనులు చేశామని, రూ.27 కోట్లతో మంచినీటి పథకం తెచ్చామని, రెండు పార్కులు నిర్మించుకున్నామన్నారు. శ్మశానాలను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన సందర్భంగా మేయర్ పాకా సురేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, డాక్టర్ నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, త్యాగరాజు, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి


