సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యలో సంక్షోభం
మైదుకూరు : సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టి వేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా ఆరోపించారు. ఆదివారం మైదుకూరులోని డీసీఎల్ ఫంక్షన్ హాల్‌లో యూటీఎఫ్ 45వ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు కడప రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి డీసీఎల్ వరకు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్‌ఐ, యూటీఎఫ్ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రతినిధుల సమావేశంలో లక్ష్మీరాజా మాట్లాడుతూ నిరంతరం ఉపాధ్యాయుల బోధనా సమయాన్ని హరిస్తూ, బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని చెబుతూనే ప్రభుత్వ విద్యకు పాతరేస్తున్నదని దుయ్యబట్టారు. యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఉద్యోగుల అండదండలతో గెద్దెనెక్కి ఇప్పుడు ఉద్యోగులను విస్మరించడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేసే కార్యక్రమాలను నిరంతరం రూపొందించి అమలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా


