యురేనియం ప్రభావిత గ్రామస్తులకు న్యాయం చేస్తాం
కడప సెవెన్‌రోడ్స్: యురేనియం ప్రభావిత గ్రామస్తులకు నష్టం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసీఐఎల్) సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారి, కేకే కొట్టాల గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యూసీఐఎల్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్ర స్థాయి పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతోందన్నారు. యురేనియం ప్రభావిత గ్రామస్తుల సమస్యలు, వారి ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తామన్నారు. స్థానిక సమస్యలను పరిగణన లోకి తీసుకుని, ప్రాజెక్టు అవసరాలు, నిర్వహణ సామర్థ్యం దృష్ట్యా.. కొత్త టెయిలింగ్ పాండ్ నిర్మాణం చేపట్టడానికి ముందే ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసి కేకే కొట్టాల గ్రామాన్ని భూసేకరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. దీనిపై పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నామన్నారు. ఇందుకు దాదాపు 6 నెలల సమయం పడుతుందన్నారు. అంతేకాకుండా నిర్వహణలో ఉన్న పాత టెయిలింగ్ పాండ్ ఎత్తును పెంచుకునేందుకు కానీ, ఏదైనా మరమ్మతులు చేపట్టేందుకు కానీ ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కేకే కొట్టాల గ్రామస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం, ఉపాధి అవకాశాలను న్యాయబద్ధంగా కల్పిస్తామన్నారు. గతంలో పరిహారంతో పాటు ఇంకా కొంతమందికి పెండింగ్ లో వున్న ఉద్యోగ కల్పన కూడా త్వరలో క్లియర్ చేయాలని యూసీఐఎల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, పీకే నాయర్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


