వసంతపేట మున్సిపల్ హైస్కూల్ ఘటనపై విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వసంతపేట మున్సిపల్ హైస్కూల్‌లో గత నెల మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజనింగ్ విషయమై హైకోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ సి.యామిని విచారణ చేశారు. ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరిగింది అనే విషయమై ప్రధానోపాధ్యాయుడు గురప్ప, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 11 మంది విద్యార్థులు, జిల్లా ఆస్పత్రి వైద్యుడు ఆనంద్‌బాబు, విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హరిత, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, చౌడేశ్వరి వంట ఏజెన్సీ నిర్వాహకులు జయలక్ష్మీ తదితరులను విచారించారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న లీగల్ సెల్ అథారిటీ జిల్లా కార్యదర్శి బాబాఫకృద్దీన్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం తింటున్న విద్యార్థులతో మాట్లాడారు. అలాగే జడ్జి యామిని మధ్యాహ్న భోజనం రుచి చూశారు. ప్రధానోపాధ్యాయుని గదిలో జడ్జి ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీవారు, వైద్యశాఖ, పోలీసు, విద్యాశాఖ, తహసీల్దార్ తదితరులను ఒక్కొక్కరిగా విచారించి వారి నుంచి వివరాలు సేకరించారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలు మోతుకూరు జయలక్ష్మిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.


