జలజలహే అన్నమయ్య
రాయచోటి: ఉత్తమ జాతీయ జలశక్తి పురస్కారాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు.
జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని జలవనరులు, నదుల అభివృద్ధి తదితర అంశాలలో 2024 సంవత్సరానికి 6వ జాతీయ జలశక్తి అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నీటిని సంరక్షించడం, నీటిని సమర్థవంతంగా నిర్వహించడం, నీటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించడం తదితర కార్యక్రమాలు చేపట్టిన గ్రామ పంచాయతీ, జిల్లా, రాష్ట్రాలకు ఈ పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ జలశక్తి అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో దుబ్బిగానిపల్లి గ్రామ పంచాయతీకి ప్రథమ స్థానం దక్కింది. మదనపల్లి మండలం, కొత్తవారిపల్లి పంచాయతీ, దుబ్బిగానిపల్లి గ్రామంలో సుమారు 75 లక్షల రూపాయలతో వాటర్ షెడ్ పనులు నిర్వహించారు. 2024 డిసెంబర్‌లో కేంద్ర జలశక్తి బృందం సభ్యులు వాటర్ షెడ్ పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపునీరు వాటర్ షెడ్‌లో నిల్వ అయి భూగర్భ జలాలు పెరిగి సత్ఫలితాలను ఇస్తున్నాయి.
బాధ్యతను పెంచింది..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. పురస్కారం వలన జిల్లా కలెక్టర్‌గా మరింత బాధ్యతను పెంచిందన్నారు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
ఆరవ జాతీయ జలశక్తి పురస్కారాలలో అన్నమయ్య జిల్లాకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు
జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందిన దుబ్బిగానిపల్లి గ్రామ పంచాయతీ
పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


