●క్లోజ్ నోటీసు లేదు
ఆరుగురు అరెస్ట్
మదనపల్లె : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మదనపల్లె కిడ్నీరాకెట్ వ్యవహరంలో జరుగుతున్న దర్యాప్తుపై లింకులు బయటపడతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులో నమోదైన ఏడుగురు నిందితులేకాక మరో 8 మంది ఉన్నారని డీఎస్పీ మహేంద్ర ప్రకటించారు. అయితే ఈ కేసుకు సాధ్యమైనంత త్వరగా ముగింపు ఇవ్వాలన్న ఒత్తిళ్లతో ఆరుగురిని ఆరెస్ట్ చేశారని భావిస్తున్నారు. అనుమతిలేని ఆసుపత్రిలో అక్రమంగా మానవ అవయవాల తొలగింపు, చట్టవిరుద్ధంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం తీవ్రమైన నేరంగా పోలీసులే చెబుతున్నారు.ఈనెల 9న యమున ఆపరేషన్ ఒకటే జరిగిందని అంతా భావించారు. రెండు జరిగినట్టు డీఎస్పీ ప్రకటించడంతో ఇంకెన్ని జరిగాయన్న చర్చ మొదలైంది.
లింకులు దొరుకుతాయా..
ఏపీ, కర్ణాటక, తెలంగాణ, గోవాల్లో ఈ కిడ్నీరాకెట్ లింకులు ఉండగా వాటిని దర్యాప్తులో తేలుస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఇప్పటికే నాలుగు బృందాలు నాలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. వెలుగులోకి వచ్చిన రెండు ఆపరేషన్లు డీసీహెచ్‌ఎస్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగాయని డీఎస్పీ మహంద్ర చెప్పగా ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయో వెల్లడించలేదు. ఈ రాకెట్ వ్యవహరంలో ఎవరు ఎవరిని కలిశారు, ఎక్కడ కలిశారు, గ్లోబల్ హాస్పిటల్‌కు వచ్చిన దాతలు, స్వీకరించిన వారు, ఆపరేషన్ చేసే వైద్యుడు ఇక్కడికి ఎప్పుడెప్పుడు వచ్చి వెళ్లారు. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. దర్యాప్తులో పోలీసు అధికారులు సాంకేతికను వినియోగించుకుని ఆధారాలను సేకరించే వీలుంది. ఇక్కడినుంచే దర్యాప్తును మరింత లోతుగా చేపడితే కిడ్నీరాకెట్ వేళ్లు ఎక్కడక్కడికి పాకాయో గుర్తించవచ్చు. ఈ ముఠా ఏ మేరకు విస్తరించిందో వాటి కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఆ డాక్టర్ దొరికేనా..
మదనపల్లెలో చట్ట విరుద్ధంగా కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన బెంగళూరుకు చెందిన వైద్యుడు దొరికేనా అన్నది చర్చనీయాంశమైంది. ఈ కేసులో రెండో నిందితుడు అతనే కావడంతో అతని నుంచి కీలక సమాచారం వస్తుందని డీఎస్పీనే వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఆ డాక్టర్ ఎక్కడున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 9న ఉదయం ఒకటి, రాత్రి ఒక కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయని డీఎస్పీ వెల్లడించాక మదనపల్లె పట్టణంలో ఆందోళన మొదలైంది. ఇంకా ఎన్ని ఆపరేషన్లు జరిగాయని చర్చించుకొంటున్నారు.
8 మందిలో వీరున్నారా?
ఈ కేసులో మరో 8 మంది ప్రమేయం ఉందని, దర్యాప్తు చేస్తున్నామని, తాము అనుమానిస్తున్న వారిలో మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగం ఇన్‌చార్జి శాశ్వతి ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. ఆయితే ఇప్పటిదాకా వీరిని విచారించారో లేదో చెప్పలేదు. డీఎస్పీ చెబుతున్న దాన్నిబట్టి చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. అలాగే ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో బెంగళూరు వైద్యుడికి సహాయంగా పనిచేసిన మరో ఇద్దరు కూడా ఉన్నట్టు చెప్పగా, మిగిలినవారి వివరాలను వెల్లడించలేదు. ఈ నలుగురు పోను మిగిలిన నలుగురు ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
గ్లోబల్ హాస్పిటల్ ఎదుట బోర్డుపై ఆంజనేయులు, శాశ్వతి, అవినాష్ ఫొటోలతో వారి వివరాలు
అరెస్టయిన సూరిబాబు, కాకర్ల సత్య, పిల్లి పద్మ
గ్లోబల్ హాస్పిటల్ గోడపై హాస్పిటల్ క్లోజ్ అనే అంగ్ల అక్షరాలతో రాసిన కాగితంపై నలుగురు వైద్యారోగ్యశాఖ అధికారులు సంతకం చేసి ఈనె ల 12న అంటించారు. ఈ నోటిసును తొలగించడం శనివారం గుర్తించారు. దీంతో ఆసుపత్రిపై చర్యలు లేవా అని చర్చించుకుంటున్నారు.
కిడ్నీ రాకెట్ కేసులో తొలి విడత ఆరుగురిని అరెస్టు చేశారు. మృతురాలు యమునా తల్లి సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో రెండో నిందితుడు బెంగళూరు డాక్టర్ అరెస్ట్ కాలేదు. అరెస్టయిన వారిలో మదనపల్లెకి చెందిన డాక్టర్ కంప ఆంజనేయులు, ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగం మేనేజర్ బాల రంగడు, సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ విభాగం మేనేజర్ మెహరాజ్, వైజాగ్ కు చెందిన సూరిబాబు, కాకర్ల సత్య, పిల్లి పద్మ ఉన్నారు. వీరిని శనివారం సాయంత్రం 4:30 గంటలకు అరెస్టు చేశారు.
●క్లోజ్ నోటీసు లేదు
●క్లోజ్ నోటీసు లేదు


