
కొండల్ని పిండి చేస్తున్నారు!
● అనధికారిక తవ్వకాలు
● చోద్యం చూస్తున్న అధికారులు
● పంచాయతీలకు భారీ నష్టమంటున్న స్థానికులు
ఖాజీపేట : గ్రామీణ రోడ్ల కోసం లేదా ఇంటి బేస్‌మట్టం కోసం మట్టిని తీసుకెళితే వెంటపడి వేధించి కేసులు నమోదు చేసే అధికారులు ఎలాంటి అనుమతులు లేకున్నా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తుంటే మౌనం వహిస్తున్నారు. అది కూడా ఫారెస్ట్ భూముల నుంచి తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి జాతీయ రహదారి నిర్మాణం కోసం అనధికారికంగా లక్షల క్యూబిక్ మీటర్లను తవ్వేస్తున్నారు. ఇందు కోసం అడవుల్లోని కొండలు సైతం పిండి అవుతున్నాయి. ఈ తవ్వకాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి అడ్డుకుంటున్న సంఘటనలు ఖాజీపేట మండలంలో నిత్యం జరుగుతున్నాయి.
మైదుకూరు నియోజకవర్గం మీదుగా ఎక్స్‌ప్రెస్ హైవే వెళుతోంది. ఆ రహదారి నిర్మాణం కోసం ఒక ప్రముఖ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఆ రహదారి నిర్మాణం కోసం ఖాజీపేట మండలం నాగసానిపల్లె సమీపంలోని కొండలను తవ్వి మట్టిని నిత్యం వందలాది టిప్పర్ల సహాయంతో తరలిస్తున్నారు. వారికి తొలుత కేవలం 300 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు మాత్రమే అనుమతులు లభించాయి. అయితే ఆ మట్టితో పాటు చుట్టు పక్కల కొండలను సైతం పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో పిండి చేసి మట్టిని తరలిస్తున్నారు.
లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు..
వాస్తవానికి కంపెనీ మట్టి తరలింపు విషయంలో కొందరు వ్యక్తులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు సమాచారం. వారు అనుమతులు ఇచ్చిన ప్రదేశంలో తవ్వడంతో పాటు అనధికారికంగా అనుమతులు లేని చోట భారీగా మట్టిని తరలిస్తున్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ పైభాగాన అటవీ కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో సైతం అనధికారికంగా భారీగా మట్టిని తవ్వేస్తున్నారు. 300 క్యూబిక్ మీటర్లు తవ్వాల్సింది పోయి ఇప్పటికే సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.
పంచాయతీలకు అందని రాయల్టీ..
రోడ్డు నిర్మాణం కోసం మట్టిని తరలించే క్రమంలో కంపెనీ వారు అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటారు. క్యూబిక్ మీటరుకు సుమారు రూ.140 నుంచి రూ.150 చొప్పున రాయల్టీ కడతారు. అలా కట్టిన రాయల్టీలో కొంతభాగం పంచాయతీకి వస్తుంది. అయితే రాయల్టీ కట్టకుండా తరలించడంపై అప్పనపల్లె పంచాయతీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో మట్టి వాడకంపై నేషనల్ అథారిటీ వారు క్యూబిక్ మీటరుకు డబ్బును నిర్ధారించి కంపెనీ వారితో కట్టించుకుంటారు. అయితే వారు వేరే ప్రాంతంలో మట్టిని తరలించినట్లు చూపుతారు. దీంతో మట్టిని తరలించుకు పోయేది ఒక చోట.. పంచాయతీకి జమ అయ్యేది వేరొక చోట. ఈ కారణంగా మట్టిని తరలించుకు పోయిన పంచాయతీకి ఎలాంటి నిధులు రావు.
అటవీ కొండల్లో సైతం..
చిలక కనం దగ్గర ఉన్న కొండలు పూర్తిగా అటవీశాఖ పరిధిలోకి వస్తాయి. అలాంటి కొండలు తవ్వాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే చాలా దూరం తవ్వినట్లు తెలుస్తోంది.
అడ్డుకున్న టీడీపీ నాయకులు..
రోడ్డు నిర్మాణం కోసం ఎలాంటి అమనుతులు లేకుండా మట్టిని తరలించడంపై టీడీపీ నాయకులు కొందరు అడ్డుకున్నారు. ఖాజీపేట మండలానికి చెందిన ఒక నాయకుడు, తెలుగుగంగ మాజీ ఏఈ కలసి మట్టిని తరలించే విషయంలో కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారే మట్టిని తరలిస్తున్నారు. అయితే అనుమతులు లేకుండా మట్టిని తరలించడంపై ఇటు అప్పనపల్లెలోని టీడీపీ నాయకులు, ఖాజీపేటకు చెందిన టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మట్టిని తరలించే చోట రహదారికి అడ్డుగా మట్టి కట్టలను వేశారు. మరో చోట వాహనాలను అడ్డు పెట్టి మట్టిని తరలించకుండా పనులను తాత్కాలికంగా నిలిపేశారు. చాలా రోజులుగా మట్టిని తరలిస్తున్నా అడ్డు చెప్పని నాయకులు ఇప్పడు అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు చర్చించుకోవడం విశేషం.
మట్టి తరలింపును నిలిపి వేయమని చెప్పాం..
అనుమతుల మేరకు మట్టిని తరలించాలి. అనుమతులు మించి మట్టిని తరలించరాదు. కంపెనీ వారు కొంత మేరకు రాయల్టీ చెల్లించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ వారికి మేం లేఖలు రాశాము. మట్టి తరలింపును తాత్కాలికంగా ఆపేయమని చెప్పాం. పూర్తి అనుమతులు వచ్చిన తరువాతనే మట్టి తవ్వకాలు చేపట్టాలని సూచించాం.
– వెంకటరామయ్య, డీఈ, గనుల శాఖ
ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు..
రోడ్డు నిర్మాణ పనుల కోసం మేము ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదు. ఎవ్వరికి సిఫార్సు చేయలేదు. అలా ఎవరైనా మట్టిని తరలిస్తే అది అనధికారిక తరలింపే అవుతుంది. వాటిని మేం అడ్డుకుంటాం.
– వెంకట రమణమ్మ, తహసీల్దార్, ఖాజీపేట

కొండల్ని పిండి చేస్తున్నారు!