
రాష్ట్రస్థాయి విజేతలుగా మైదుకూరు విద్యార్థులు
మైదుకూరు : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మైదుకూరు మండలానికి చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కావలిలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ జిల్లాల మధ్య జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజేతగా నిలిచిందని మండలంలోని వనిపెంట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా జట్టులో తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు హిమబిందు, దివ్య, స్నేహ, అమీరూన్, 10వ తగరతి విద్యార్థినులు కుసుమ, అపూర్వలు ప్రతిభ కనపరిచి వైఎస్సార్ కడప జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేశారని ప్రిన్సిపాల్ వివరించారు. విజేత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపాల్ నిర్మల, పీఈటీ శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు.