
బీసీల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : వెనుకబడిన వర్గాలు(బీసీ)ల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ విమర్శించారు. బుధవారం ఆ పార్టీ నాయకులతో కలిసి పాత రిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బీసీ భవన్‌లోని స్టడీ సెంటర్, లైబ్రరీ, మూడో అంతస్తులో ఉన్న విడిది రూములను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక భవనం ఉండాలనేది చిరకాల వాంఛ అని, అన్ని ప్రభుత్వాలకు అనేక మార్లు విన్నవించినా ఏ ప్రభుత్వం స్పందించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ వల్ల బీసీ భవన్ సాకారమైందన్నారు. కడప శివార్లలో రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తామని అధికారులు చెబితే తాము కడప నగరంలోనే కావాలని పట్టుబట్టి పాతరిమ్స్ ప్రాంగణంలో సెంటు రూ.20 లక్షలు పలికేచోట 0.20 సెంట్ల స్థలాన్ని కేటాయింపజేశామన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఎంపీ నిధుల నుంచి రూ.6కోట్లు భవన నిర్మాణానికి మంజూరు చేయగా, అత్యంత సుందరంగా బీసీ భవన్‌ను నిర్మించారన్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో బీసీ భవన్ పనులు ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా పెండింగ్‌లో ఉంచడం దారుణమన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సరైన పుస్తకాలు, కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు వంటివి ఏవీ లేవన్నారు. స్టడీ హాల్‌లో విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ భవన్‌లో విశ్రాంతి గదుల్లో ఏసీలు, మంచాలు, పరుపులు, స్టడీ హాల్‌లో కుర్చీలు, టేబుళ్లు వంటివి ఏవీ లేవన్నారు. రూ.50లక్షలు ఖర్చు చేస్తే అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెబితే, తాము జోలె పట్టుకొని బీసీ భవన్‌లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సింధే రవి, గంగరాజు, మహిళా నాయకురాలు నారాయణమ్మ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నాయకులు