
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
కమలాపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుండటాన్ని నిరసిస్తూ వెఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో నల్లింగాయపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకై క ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను అతి తక్కువ ధరలకు సింగిల్ టెండర్‌లోనే అమ్మకాలు చేస్తున్నారన్నారు. ఎకరా భూమి 99 పైసలకే కూటమి ప్రభుత్వం అమ్ముతోందని, ఏడాదికి రూ.4వేలు అద్దె ప్రకారం ధారా దత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇంటి అద్దె కూడా ఇంత దారుణంగా ఉండదన్నారు. 50 ఎకరాల ప్రభుత్వ ఆసుపత్రిని ఏడాదికి రూ.4వేలకు ఇవ్వడం దారుణం అన్నారు.
విద్య వైద్యంపై చిత్తశుద్ధి లేదు: నరేన్
ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే అంశాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువస్తే ప్రజా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని మరింత విస్తరించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారన్నారు. 10 మెడికల్ కళాశాలలతో పాటు హాస్పిటల్స్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇదే జరిగితే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు లభించవన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణ చేపట్టి తమ నిరసన వ్యక్తం చేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
వైద్య విద్య భారం: రాజోలి వీరారెడ్డి
పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ సలహాదారుడు రాజోలి వీరారెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ జరిగితే రూ. 1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ఫీజు చెల్లించే వైద్య విద్యార్థులు కోటి రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తోందని మండి పడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యంరెడ్డి, రామ లక్ష్మీరెడ్డి, మోహన్ రెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, మహ్మద్ సాదిక్, చెన్నకేశవరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.