
అప్పుల భయంతో యువకుని ఆత్మహత్య
పోరుమామిళ్ల : అప్పుల భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లెలో జరిగింది. ఎస్‌ఐ కొండారెడ్డి కథనం మేరకు కమ్మవారిపల్లెకు చెందిన యువరైతు కలవకూరి నాయుడుబాబు(37) చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతో పాటు సుమారు రూ. 15 లక్షల దాకా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక భయంతో ఈనెల 18న పురుగుల మందు తాగాడు. అతన్ని బంధువులు నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తీసికెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి వర్గాలు ఇంటికి తీసికెళ్లమని చెప్పడంతో మంగళవారం ఇంటికి తెచ్చారు. బుధవారం ఉదయం నాయుడుబాబు మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు మైనర్ కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిరుపేద పిల్లల ఆధార్
రిజిస్ట్రేషన్ పరిశీలన
కడప అర్బన్ : కడప నగరం మోచంపేటలోని ఆధార్ సెంటర్‌ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ బుధవారం పరిశీలించారు. సాథి క్యాంపెయిన్‌లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిరుపేద పిల్లల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డుకు పట్టే సమయం, ఆధార్‌లో ఏమైనా సమస్యలు వస్తే తిరిగి ఎలా చేయించుకోవాలి తదితర అంశాలను విచారించారు. నిరుపేద పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్‌లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.

అప్పుల భయంతో యువకుని ఆత్మహత్య