
స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నం
● ఫిర్యాదు చేసిన సర్పంచ్, ప్రజలు
● విచారించిన తహసీల్దారు
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని పుట్టాయపల్లె పంచాయతీలోని 186 బూత్‌లో గ్రామానికి చెందిన కొందరు స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వంకెల జయరామిరెడ్డి, స్థానిక ప్రజలు డివిజన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో దరఖాస్తు చేసిన వ్యక్తులు సైతం తమ వారి ఓట్లు నమోదు చేయడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ సూచనల మేరకు బుధవారం పుట్టాయపల్లె సచివాలయంలో తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు గ్రామసభ నిర్వహించి గ్రామస్తులను విచారించారు. గ్రామంలో నివాసం లేని చెన్నంపల్లె, అట్లూరు మండలం గుజ్జులవారిపల్లె, మణ్యంవారిపల్లె, బద్వేలు టౌన్ ఎన్జీఓ కాలనీలకు చెందిన పలువురిని పుట్టాయపల్లె గ్రామ బూత్ నెంబర్ 186లో ఓటర్లుగా నమోదు చేయించేందుకు గ్రామానికి చెందిన బీరం జయరామిరెడ్డి, బీరం విజయనరసింహారెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారని పుట్టాయపల్లె సర్పంచ్ జయరామిరెడ్డి మండల ఉప ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో తమ వారి ఓట్లు బీఎల్‌ఓ నమోదు చేయడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదులు అందాయి. ఇరువురి వాదనల మేరకు ఆర్డీఓ ఆదేశాలతో గ్రామంలో విచారణ చేపట్టామని, తుది నివేదికను ఆర్డీఓకు అందజేస్తామని తహసీల్దారు తెలిపారు.