
రోడ్డుకు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్సీ
వైఎస్సార్‌సీపీ నేతలు పూడ్చిన గుంత, దెబ్బతిన్న రోడ్డు వద్ద నుంచి డీఈతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ
జమ్మలమడుగు : పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె కుందూ నదిపై ఉన్న బ్రిడ్జికి సమీపంలో రంధ్రాలు పడ్డాయని గ్రామస్తులు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మూడు రోజుల నుంచి బస్సులు రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. దీంతో ఆదివారం రామసుబ్బారెడ్డి నెమళ్లదిన్నె బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి సమీప ప్రదేశంలో రంధ్రం పడటంతో దానికి మరమ్మతులు చేయించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. అయితే ప్రస్తుతం పండుగ సందర్భంగా సెలవులు ఉన్నాయని, తర్వాత చేస్తామంటూ డీఈ తెలిపారు. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన.. ఎగువ భాగాన ఉన్న జంగాలపల్లి, బలపనగూడురు, ఉప్పలపల్లి, జె.కొట్టాలపల్లి గ్రామాలకు చెందిన ఆరు వేలజనాభాకు రాకపోకలకు అంతరాయం కలగడంతో వెంటనే రంధ్రాలను పూడ్చాలని స్థానిక నేతలను ఆదేశించారు. దీంతో స్థానిక నేతలు జంగాలపల్లి వీరారెడ్డి, నెమళ్లదిన్నె సుదర్శన్‌రెడ్డి, సురేష్, శంకర్, బలపనగూడురు రామచంద్రారెడ్డి వెంటనే పొక్లెయిన్ తెప్పించి పనులు ప్రారంభించారు. రంధ్రాలను పూర్తిగా పూడ్చిన తర్వాత స్థానిక ఎస్‌ఐ సుబ్బారావు అక్కడికి చేరుకుని పనులు ఎవరు చేయమన్నారంటూ ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ స్థానిక నేతలకు హుకుం జారీ చేశారు. అప్పటికే పనులు పూర్తి కావడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా సంఘటన స్థలం నుంచి వెనుదిరిగారు.
చేసిన పనులనే మళ్లీ చేసి..
నెమళ్లదిన్నె బ్రిడ్జి వద్ద ఎమ్మెల్సీ పనులు చేయిస్తున్న విషయం తెలుసుకున్న కూటమి నేతలు.. వైఎస్సార్‌సీపీ నాయకులకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వెంటనే పోలీసులను పంపించి పనులు ఆపాలని ప్రయత్నం చేశారు. అయితే గత కొన్ని నెలలుగా పట్టించుకోని కూటమి నేతలు.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మళ్లీ మేము చేస్తామంటూ వితండవాదం చేస్తూ మరో పొక్లయిన్ తెప్పించి పనులు చేస్తున్నట్లు ఫోజులు ఇచ్చారు. ఏదిఏమైనా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాకవల్ల రోడ్డు బాగు పడిందని, రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రామసుబ్బారెడ్డి స్పందనపై ప్రజల్లో హర్షం
పనులు ఎందుకు చేశారంటూ
ప్రశ్నించిన పోలీసులు
స్థానిక నేతలను అక్కడి నుంచి
పంపించిన వైనం

రోడ్డుకు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్సీ