
వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
కడప రూరల్ : వడ్డెర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గం సమావేశం జిల్లా గౌరవ అధ్యక్షులు బాలకొండయ్య, రమణయ్య ఆధ్వర్యంలో జరగ్గా.. నూతన జిల్లా అధ్యక్షులుగా చంద్రగిరి నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాయచోటి వెంకటసుబ్బయ్య (కమలాపురం)లను ఎన్నుకున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వడ్డెర్లను వాడుకుని తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం జరుగుతోందన్నారు. ఈ కారణంగా తరతరాలుగా వడ్డెర్లు ఎలాంటి అభ్యున్నతికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ సమస్యలు పట్టించుకునే నాథుడే లేరన్నారు. ముఖ్యంగా వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నా పాలకులకు పట్టడం లేదని తెలిపారు. ఈ క్రమంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి నియోజకవర్గాల, మండలాల నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా యువజన, మహిళ, ఉద్యోగ సంఘాలతోపాటు ఇతర విభాగాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి పోరాటాలే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిర్దేశించుకున్న డిమాండ్లను సాధించగలమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, వడ్డెర కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.