
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి?
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఎంతో చారిత్రకత కలిగి, విశిష్టత ఉన్న దేవాలయం. త్రేతా యుగంలో మృకుండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముడిని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం.. సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొంది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, ఆ తరువాత జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశారని ప్రజల విశ్వాసం. ఇక్కడ శ్రీరాముడు కొలువై ఉన్నారని ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది.
అలాంటిదే ఇమాంబేగ్ బావి కూడా.
ఒంటిమిట్ట : కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా క్రీ.శ 1640లో ఇమాంబేగ్ పని చేశారు. ఈయన సిద్దవటం కోటకు వెళ్తూ, ఎండ తీవ్రంగా ఉండటంతో ఒంటిమిట్ట చెరువు సమీపానికి రాగానే.. తన గుర్రానికి చెరువు నీళ్లు తాగించి, తాను కూడా ఒంటిమిట్ట రామాలయం వసారాలలో సేదతీరాడు. ఆ సమయంలో అక్కడున్న వారు దేవుడు ఉన్నాడు, లేడని వాదోపవాదాలు చేసుకుంటున్నా రు. అది విన్న ఇమాంబేగ్ దేవస్థానం వాకిలి మూసిన తరువాత బయట నుంచి శ్రీరామచంద్రుని మహిమను స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అక్కడ వాదోపవాదాలు చేస్తున్న వారితో ఇలా అన్నాడు. మీ దేవుడు పిలిచినా పలుకునా? అని ప్రశ్నించారు. దీనికి త్రికరణ శుద్ధిగా పిలిస్తే.. తప్పక పలుకునని వారు సమాధానమిచ్చారు. అప్పడు ఇమాంబేగ్ ఏకాంతంగా తలుపుల దగ్గరకు పోయి ఓ రామ! అని ఇస్లాంలో..
● పరిత్యకుడైన సైతాన్ ప్రలోభముల నుంచి నన్ను రక్షించుము.
● పరమానుగ్రహ శోభితుడును
● ప్రభూ! వరమానుగ్రహ శోభితుడును, సర్వదయాయుడనై భగవంతుని నామంతో జగత్ ప్రభువును కరుణానుగ్రహ మూర్తియు న్యాయ నిర్ణయ దినస్వామియు అగు భగవంతుని స్తుతింతును. నిన్నే మేము పూజింతుము. నిన్నే మేము సాయం కొరకు అర్థింతుము, మాకు రుజు మార్గమును చూపుము అని ఓ రామా! ఓ రఘురామా! ఏకశిలానగరదామా! కోదండ రామా! అని మూడు సార్లు పిలిచాడు. మూడవ సారి అతనికి దివ్య మధురముగా ‘‘ఓఓఓ’’ అనే సమాధానం వినిపించింది. అది విన్న ఇమాంబేగ్ సంతోషంతో మోకరిల్లి అనంద భరితుడై వినయంగా శ్రీస్వామి వారి రూపాన్ని దర్శించి, ఆలయానికి ఆగ్నేయ దిశన బావిని తవ్వించారు.
అభిషేకానికి నీరు సరఫరా
అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం ముస్లింలు స్వామిని దర్శిస్తూ వారి కోరికలు సఫలీకృతం చేసుకుంటున్నారు. అంతే కాదు ఏకశిలపై వెలసిన సీతారామలక్ష్మణులకు ఆ బావి నుంచి అభిషేకానికి నీళ్లు కూడా సరఫరా అయ్యేవి. కులమతాలకు అతీతంగా, స్వామి సాక్షాత్కారానికి గుర్తుగా నిర్మించిన అంతటి చరిత్ర కలిగిన ఇమాంబేగ్ బావిని మరుగునపడేశారు. క్రమేణ ఆ బావి పూర్తిగా పూడిపోతోంది.
లభించని పురావస్తుశాఖ అనుమతి
ఇమాంబేగ్ బావి ఒంటిమిట్ట రామాలయ చరిత్రలో ఉంది కానీ, భక్తుల సందర్శనానికి నోచుకోలేదు. ఇమాంబేగ్ బావి పునరుద్ధరణ చేయడానికి పురావస్తుశాఖ అనుమతులు లేక పోవడమే కారణమని ఒకపక్క టీటీడీ వారు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తలచుకుంటే పురావస్తు శాఖ వారితో కలిసి ఎన్నో చారిత్రక దేవాలయాలను పునరుద్ధరణ చేసిన ఘనత ఉంది. కానీ ఒంటిమిట్టలో భక్తులు సందర్శించి, తెలుసుకోవాల్సిన ఇమాంబేగ్ బావిని, దాని చరిత్రను ఎందుకు కల్పించలేదో అర్థం కావడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇమాంబేగ్ బావిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒంటిమిట్ట రామాలయానికి భక్తుల తాకిడి పెంచి, అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ వారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి ద్వారానైనా రామాలయ చారిత్రక గుర్తులకు పూర్వ వైభవం వస్తుందో లేదో వేచి చూడాలి.
ఒంటిమిట్టలో మరుగునపడ్డ
ఇమాంబేగ్ బావి
స్వామి సాక్షాత్కారానికి గుర్తు
ముస్లింలు సైతం పూజించేందుకు
ఇదే కారణం
పునరుద్ధరించాలని కోరుతున్న భక్తులు

చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి?