
సీనియర్ సిటిజెన్స్‌కు మంత్రిత్వ శాఖ అవసరం
మదనపల్లె సిటీ : సీనియర్ సిటిజెన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వీరారావ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఏపీ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరారావ్ మాట్లాడుతూ వృద్ధులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు రాసే సమయంలో తమను సక్రమంగా చూసుకుంటేనే ఆస్తి చెందేలా వీలునామా రాయాలన్నారు. దీంతో తల్లిదండ్రులను పిల్లలు సక్రమంగా చూసుకుంటారన్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులపై జరిగే దాడులు, హత్యలు నివారించాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. 2007 చట్టం సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ, ధనలక్ష్మి, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఆనంద వృద్ధాశ్రమం ఆనంద్, రిటైర్డ్ ఎయిర్‌ఫోర్సు ఆఫీసర్ పరాంధామగౌడ్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎన్.వి.నాయుడు, గౌరవ అధ్యక్షులు వై.ఎస్.మునిరత్నమయ్య, ఉపాధ్యక్షులు జగన్‌మోహన్, కోశాధికారి ఉస్మాన్‌సాహెబ్, తిరుపతిరావు నాగరాజు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, మహిళా ప్రతినిధి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి ఇద్దరు కర్ణాటక వాసులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. కర్ణాటక హవేరి ప్రాంతానికి చెందిన మల్లికార్జున(33), కనకపురకు చెందిన ముత్తురాజ్(32) ఎలక్ట్రానిక్ సిటిలో డీమార్ట్‌లో పని చేస్తుంటారు. ఇద్దరూ కలిసి శనివారం ద్విచక్రవాహనంలో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి బెంగళూరుకు బైక్‌లో తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో తిరుపతి–మదనపల్లె హైవేలోని పాలెంకొండ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ముత్తురాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.