
ఆరోగ్యం కోసం రోజూ నడుద్దాం
మదనపల్లె రూరల్ : ‘ఆరోగ్యమే మహాభాగ్యం. మెరుగైన ఆరోగ్యం పొందాలంటే ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో నడకను అలవాటు చేసుకోవాలి. అప్పుడే అద్భుతమైన ప్రయోజనాలు పొందగలం’ అంటూ డీఎస్పీ కె.మహేంద్ర తెలిపారు. ప్రతిరోజు కేసులు, ఇన్వెస్టిగేషన్, డ్యూటీల పేరుతో క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం కొత్తగా ఏదైనా చేద్దామని తలచారు. తలచిందే తడవు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అనుమతితో, డీఎస్పీ మహేంద్ర సారథ్యంలో.. మదనపల్లె మండలం వేంపల్లె మల్లయ్యకొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం వేకువజామున ఒక్కొక్కరుగా పోలీసు సిబ్బంది మల్లయ్యకొండ కిందకు చేరుకున్నారు. అందరూ కలిసికట్టుగా కొండ ఎక్కేందుకు బయలుదేరారు. కొండ ఎక్కే క్రమంలో చుట్టూ ప్రకృతి అందాలను చూడటంతోపాటు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేలేత కిరణాలను చూస్తూ, పిల్లగాలుల శబ్దాలను ఆలకిస్తూ మైమరచిపోయారు. కొండ ఎక్కడంలో అలసిన ఖాకీలు ఓ చోట సేద తీరేందుకు నిలిస్తే... డీఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులు కఠినమైనవని, ఆరోగ్యం కాపాడుకోవడం అంటే, కుటుంబం, సమాజం కోసం బలంగా నిలవడం, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటమని ఉత్సాహాన్ని నింపారు. దీంతో రెట్టింపైన ఉత్సాహంతో సిబ్బంది ముందుకు సాగి మల్లయ్యకొండకు చేరుకున్నారు. కొండపై నుంచి మదనపల్లె పట్టణ దృశ్యాలను తమ సెల్‌పోన్లలో బంధించి, సెల్ఫీలు తీసుకుని కాసేపు సరదాగా గడిపారు. ట్రెక్కింగ్‌లోని అనుభవాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లికి తెలిపితే.. ఆయన పోలీస్ సిబ్బంది ప్రయత్నాన్ని హర్షించడమే కాకుండా, ఆదివారం ఆరోగ్యం కోసం పోలీసులు వేసిన అడుగు.. ఐక్యతకు సంకేతం కావాలని, పోలీసు కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలంటూ సందేశం పంపారు. మల్లయ్యకొండకు ట్రెక్కింగ్ చేసిన వారిలో సీఐలు కళావెంకటరమణ, రమేష్, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, చంద్రమోహన్, తిప్పేస్వామి ఉన్నారు.
డీఎస్పీ కె.మహేంద్ర