అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు

Oct 11 2025 6:26 AM | Updated on Oct 11 2025 6:26 AM

అంతర్

అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు

ఆరుగురు అరెస్టు

రూ.2లక్షలు విలువైన

రాగి, 4 వాహనాలు స్వాధీనం

డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌

మైదుకూరు : ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగేలా పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్‌ను ఎత్తుకెళ్లే ఆరుగురు అంతర్‌ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2లక్షలు విలువ చేసే రాగి, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మైదుకూరు పోలీస్‌ సబ్‌ డివిజనల్‌ కార్యాలయంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ విలేకరులకు ఆ వివరాలను వెల్లడించారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా అక్కమాంబాపురం గ్రామానికి చెందిన అయితా వెంకటేశ్వర్లు, పొదలకూరు గ్రామానికి చెందిన కుడుముల రాజేష్‌, పులగల చిన్న మస్తానయ్య, ఉయ్యాల పోతురాజు, కొత్తవెల్లంటి గ్రామానికి చెందిన పంది శ్రీనివాసులు, చెర్లోపల్లె గ్రామానికి చెందిన గంగోడి దేవకుమార్‌ అనే వారు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్‌ను ఎత్తుకెళ్లి విక్రయించుకునేవారు. వీరిపైన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సోమశిల, మర్రిపాడు పోలీస్‌స్టేషన్లలో 8 కేసులు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, బద్వేలు, కాశినాయన, కలసపాడు, బి.కోడూరు పోలీస్‌స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే వీరు 40 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్‌ను దొంగలించారు. రాగి వైర్‌ చోరీపై నమోదైన కేసుల మేరకు మైదుకూరు అర్బన్‌ సీఐ కె.రమణారెడ్డి, ఎస్‌ఐ చిరంజీవి, బ్రహ్మంగారిమఠం ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ నిందితులను బ్రహ్మంగారిమఠం – మిట్టమానుపల్లె రహదారిలోని ఈశ్వరదేవీ గుహ సమీపంలో పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2లక్షలు విలువ చేసే 150 కిలోల రాగి ముద్దలు, 150 కిలోల రాగి వైర్‌తోపాటు దొంగతనాలు చేసేందుకు ఉపయోగించే మూడు మోటార్‌ బైక్‌లను, ఒక గూడ్స్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు మైదుకూరు అర్బన్‌ సీఐ కె.రమణారెడ్డి, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం ఎస్‌ఐలు చిరంజీవి, శివప్రసాద్‌, సిబ్బంది పి.వెంకటన్న, కేవీ రమణ, బీవీ రమణారెడ్డి, ఓబులయ్య, దాదావలి, రాజేష్‌, తిరుమలయ్య, గణేష్‌, నవీన్‌ కృషి చేశారని ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వారిని అభినందించారు. సమావేశంలో సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐలు చిరంజీవి, శివప్రసాద్‌, ఎస్‌.సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

కల్లు విక్రయం నుంచి

ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం వైపుగా..

ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి వైర్‌ను ఎత్తుకెళ్లే అంతర్‌ జిల్లాల ముఠా సభ్యులు దొంగతనాలపై ఎలా ఆకర్షితులయ్యారే విషయాన్ని పోలీసులు తెలిపిన వివరాల మేరకు పరిశీలిస్తే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. నిందితుల్లో ఏ1గా ఉన్న అయితా వెంకటేశ్వర్లు, ఏ2గా ఉన్న కుడుముల రాజేష్‌లు రాజంపేట మండలంలోని మందపల్లె గ్రామం వద్ద కల్లు గీసి అమ్ముకొని బతుకుతుండేవారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో నీటి ప్రవాహానికి పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయి. వెంకటేశ్వర్లు, రాజేష్‌ ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను పగలగొట్టి అందులోని రాగి వైర్‌ను ఎత్తుకెళ్లి అమ్ముకోవడం ప్రారంభించారు. పగటిపూట గూడ్స్‌ వాహనంలో పొలాల వెంట తిరిగి రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో దొంగతనాలు చేసేవారు. దొంగలించిన రాగి వైర్‌ను కొంత కరిగించి ముద్దలుగా, మరికొంత వైర్‌ రూపంలోనే నిందితుల్లో ఒకరైన గంగోడి దేవకుమార్‌కు చెందిన గూడ్స్‌ వాహనంలో తీసుకెళ్లి విక్రయించేవారు. రెండు జిల్లాల్లో ఎంతో మంది రైతులకు తీవ్ర నష్టం కలిగించిన వీరు ఆ క్రమంలోనే మైదుకూరు పోలీసులకు దొరికిపోయారు.

అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు 1
1/1

అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement