
బావిలో దూకి ఆత్మహత్యాయత్నం
● బాధితుడిని కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్
● సకాలంలో స్పందించినందుకు
ఎస్పీ ప్రశంస
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి ఓ వ్యక్తి చేతి నరాలు కోసుకుని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో స్పందించిన ఏఆర్ కానిస్టేబుల్ బాధితుడిని కాపాడి ఆస్పత్రికి తరలించాడు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలిలా...కర్ణాటక రాష్‌ట్రం బెంగళూరుకు చెందిన కృష్ణమాచారి కుమారుడు చెంగాచారి(33) తన భార్య శశి, కుమారుడితో కలిసి గురువారం మదనపల్లె పట్టణం ఎస్టేట్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఆలయానికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం కుటుంబ సమస్యల కారణంగా చెంగాచారి భార్య శశితో గొడవపడ్డాడు. ఆమె దూషించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వచ్చి పట్టణంలోని బెంగళూరు రోడ్డు మడికయ్యల శివాలయం వద్దకు చేరుకుని అక్కడే చేతి నరాలు కోసుకున్నాడు. కబరస్థాన్ పక్కన ఉన్న కోడిగుడ్డు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బావిలోకి దూకే క్రమంలో లోపల ఉన్న చెట్టు కొమ్మలకు తగులుకుని వేలాడుతూ, ప్రాణభయంతో కేకలు వేశాడు. అయితే అదే సమయానికి మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఎస్.అమరనాథ్, పిల్లలను స్కూల్‌కు తీసుకువెళ్లేందుకు అటువైపు వచ్చాడు. చెంగాచారి పెడుతున్న కేకలు విని అటువైపు వెళ్లి బావిలో వ్యక్తి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఓ తాడు తీసుకువచ్చి మరొకరి సాయంతో బావిలోకి దిగి చెంగాచారిని బయటకు తీసుకువచ్చాడు. తన వాహనంలో జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించాడు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. విషయం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి వెళ్లడంతో ఆయన ఏఆర్ కానిస్టేబుల్ అమరనాథ్‌ను అభినందించారు. విధి నిర్వహణలో నిబద్ధత చూపినందుకు ప్రశంసించారు. పోలీసు రివార్డుకు సిఫారసు చేశారు.