
తాగు, సాగు నీటికే ప్రాధాన్యత
లింగాల: తాగు, సాగునీటికే తొలి ప్రాధాన్యత అని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీబీఆర్ నిర్వహణ, నీటి నిల్వలు, సరఫరా వ్యవస్థలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీబీఆర్ ఈ ప్రాంతానికి జీవనాధారం వంటిదన్నారు. పులివెందుల పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఏ ఒక్క రోజు కూడా తాగునీటి కొరత రాకూడదన్నారు. సీబీఆర్ నుంచి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వరకు నీటి సరఫరా జరిగే పైప్‌లైన్లను, పంపింగ్ స్టేషన్లను ప్రతి వారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడైనా లీకులు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. కాలువల్లో పూడిక లేకుండా చేసి, నీరు వృథా కాకుండా చూసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనన్నారు. పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ రాముడు, జలవనరుల శాఖ అధికారులు వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
న్యాక్ బిల్డింగ్ భవనాల పరిశీలన
పులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న న్యాక్ బిల్డింగ్ భవనాలను శనివారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాక్ బిల్డింగ్ భవనాలు ఖాళీగా ఉంటే మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల హాస్టల్‌ను తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేసే విషయమై ఆర్డీఓ చిన్నయ్యతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ ప్రిన్సిపల్ హరిత, మున్సిపల్ కమిషనర్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి