
పల్లె వైద్యం పడక!
కడప రూరల్: గ్రామీణ వైద్యం పడకేసింది. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి వైద్యులు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 9వ రోజుకు చేరింది. దశల వారీగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గతనెల 26వ తేది నుంచి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో గ్రామీణుల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో మొత్తం 51 పీహెచ్‌సీలు ఉన్నాయి. బంద్ కారణంగా వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. డాక్టర్లు లేరని తెలుసుకున్న స్థానికులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు.
సమ్మెను విఫలం చేసేందుకు యత్నాలు వైద్యులు ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించాలి....టైమ్–బౌండ్ పదోన్నతులు అమలు చేయాలి...పీహెచ్‌సీ వైద్యులకు ఖచ్చితమైన పనిగంటలను నిర్దేశించాలి.. తదితర మొత్తం 11కు పైగా డిమాండ్లతో సమస్యల పరిష్కారానికి వైద్యులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమ్మెను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి తదితర ప్రభుత్వ విభాగాల నుంచి కొంతమంది వైద్యులను పీహెచ్‌సీలకు పంపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ కూటమి పాలకులు ఏమాత్రం స్పందించకపోవడంపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గ్రామీణులకు లభించని వైద్య సేవలు
9వ రోజుకు చేరిన పీహెచ్‌సీ
వైద్యుల ఆందోళన
చోద్యం చూస్తున్నకూటమి పాలకులు