
నమో నారసింహా
గుర్రంకొండ: నమో నారసింహా అంటూ భక్తులు గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివారిని కొలిచారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో తరిగొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రాత్మాక గుర్రంకొండ కోటలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో వేకువజామేన అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కడప రూరల్: ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రాలలో 474 వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్, డాక్టర్ రవిబాబు, రమేష్, మనోరమ, భారతి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు
రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర మంత్రి రామ్‌దాసు అథవాలే అక్టోబర్ 4, 5 ,6 తేదీల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించ నున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు. శనివారం కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మూడవ సారి కొనసాగుతున్నదని తెలిపారు. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి, తిరుమల దేవస్థానాన్ని సందర్శించ నున్నారని, అక్కడ ఆయనకు ఘనంగా సన్మానం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళగిరిలోని సికే ఫంక్షన్ హాలులో మంత్రి అథవాలే చేతుల మీదుగా వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

నమో నారసింహా

నమో నారసింహా

నమో నారసింహా