సెయిల్‌ కంపెనీలో చోరీ | - | Sakshi
Sakshi News home page

సెయిల్‌ కంపెనీలో చోరీ

Sep 14 2025 2:32 AM | Updated on Sep 14 2025 2:32 AM

సెయిల

సెయిల్‌ కంపెనీలో చోరీ

కొండాపురం : సెయిల్‌ కంపెనీలో వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. టి.కోడూరు సమీపంలోని సెయిల్‌ కంపెనీలో శుక్రవారం రాత్రి సోలార్‌ కాపర్‌ ప్లేట్ల చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్‌ఐ రాయపాటిబాసు వివరాల మేరకు.. సెయిల్‌ కంపెనీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు, మరో వ్యక్తి కలిసి సోలార్‌ కాపర్‌ ప్లేట్లను చోరీ చేశారు. టి.కోడూరు గ్రామానికి వచ్చే రోడ్డు వద్ద తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందన్నారు. సంస్థ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

కరస్పాండెంట్‌పై పోక్సో కేసు

మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్‌పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్‌కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్‌ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్‌ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్‌ ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

కాలువలో పడ్డ స్కార్పియో

పులివెందుల రూరల్‌ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్‌, శ్రీనివాసనాయక్‌, నారాయణ స్వామి, చంద్రనాయక్‌, రమేష్‌నాయక్‌, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

స్కూల్‌ బస్సు ఢీకొని ఒకరు మృతి

మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్‌ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్‌ ఏస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మితిమీరుతున్న స్కూల్‌ బస్సుల వేగం

జీవీ సత్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్‌జెండర్‌ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్‌ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నగదు ఇవ్వమన్నందుకు దాడి

మదనపల్లె రూరల్‌ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్‌వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్‌ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్‌ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్‌ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్‌వలిలపై దాడి చేయించాడు. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందారు.

ఆత్మహత్యాయత్నం

మదనపల్లె రూరల్‌ : మండలంలోని ఓ మహిళఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతోంది. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సెయిల్‌ కంపెనీలో చోరీ 1
1/1

సెయిల్‌ కంపెనీలో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement