
అమ్మకానికి ఎర్రబంగారం
డిమాండ్ ఎందుకు..
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటవీశాఖ ఎర్రచందనం నిల్వలపై దృష్టి సారించింది. కేంద్రీయ డిపో(తిరుపతి)లో ఉన్న ఎర్రచందనం అమ్మేందుకు అన్ని చర్యలను తీసుకుంది. శేషాచలం అటవీ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా సెంట్రల్‌డిపోకు తరలిస్తున్నారు. రాజంపేట, కపిలతీర్ధంలో కూడా ఎర్రచందనం డిపోలు ఉన్నాయి. వీటి నిల్వల విషయంలో సీఆర్‌ఎస్ ప్రధానంగా వ్యవహారిస్తోంది. ప్రస్తుతానికి 135 టన్నులు వేలానికి సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సీఆర్‌ఎస్ సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో శేషాచలం, వెలుగొండలో మాత్రమే అధికంగా ఎర్రచందనం పెరుగుతోంది. ఈ కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాపైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తులో ఉన్నాయి.
రాజంపేట ఎర్రబంగారానికే డిమాండ్
జీవవైవిధ్యఅటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తింపు పొందిన శేషాచలం ఎర్రచందనం చెట్లతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయమార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వైఎస్సార్‌జిల్లాలో 3.2 మిలియన్లు హెక్టార్లలో, అన్నమయ్య జిల్లాలో 2.8 మిలియన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి.
ఎర్రచందనం అనే పేరు ఎలా..
ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరోకార్పస్‌సాంటలైనస్ అనేది దీని శాసీ్త్రయనామం. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్(కర్ర) అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలాగట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీనినే ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం. ఎర్రబంగారం అని కూడా అంటారు.
రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలో..
రాజంపేట, రైల్వేకోడూరు రేంజ్ పరిధిలో 50 వేల హెక్టారలో శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో అధికంగా ఎర్రచందనం ఉంది. ఈ అడువులను జీవావరణ రిజర్వుగా కేంద్రం ప్రకటించింది. ఐదువేల వృక్షజాతులు మొక్కలు కలిగిన శేషాచల అడవులకు బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవులో 1700పైగా పుష్పించే జాతి మొక్కలు ఉన్నాయి.
దుంగలన్నీ ఒకచోటికి..
స్మగ్లర్ల అక్రమరవాణా నేపథ్యంలో ఎల్లలు దాటిన ఎర్రచందనాన్ని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్మగ్లర్లు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రదుంగలను , అటవీ, పోలీసు,కస్టమ్స్‌శాఖల వద్ద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఒకేచోటికి రప్పించి భద్రపరిచే పనులకు నాలుగేళ్ల క్రితం అటవీశాఖ శ్రీకారం చుట్టింది. టెండర్ల ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుపతి కేంద్రీయ ఎర్రచందనం డిపోకు జిల్లాలోని డిపోలో నిల్వ ఉంచిన వాటిని తరిలిస్తారు. అక్కడే వేలంపాట నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు.
చైనా, జపాన్‌లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలుకూడా ఎర్రచందనంతో తయారు చేసినవి వాడుతుంటారు. సంగీతవాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. రష్యా వాళ్లు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధగుణాలు ఉన్నాయి. వయగ్రా, కాస్మెటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్‌ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు.
విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ చెట్లను నరకకుండా అడ్డుకుంటోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌లో పోలీసు, ఫారెస్టు, ఏపీఎస్‌పీ, సివిల్ పోలీసు డిపార్టుమెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్‌క్వార్టర్‌గా పనిచేస్తోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది.
సీఆర్‌ఎస్ డిపోలోని నిల్వ ఉన్న మూడు రకాల ఎర్రబంగారం వేలంపాటకు సిద్ధమైంది. ఈ–సేల్ ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 6 వరకు ఎర్రబంగారు కొనుగోలు దారులు డిపో సందర్శించే అవకాశం కల్పించారు. చిప్స్, బటన్స్, రూట్స్ రకాలను వేలంపాటలో అమ్మకానికి సిద్ధం చేశారు. రేట్ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయనుంది.
ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అటవీ
ప్రాంతం నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన దుంగలను కేంద్రీయ ఎర్రచందనం డిపోలో భద్రపరుస్తారు. వాటికి వేలం పాట నిర్వహించనున్నారు.
అటవీప్రాంతం: శేషాచలం(బయోస్పెయిర్)
అన్నమయ్య జిల్లా: 2.8 మిలియన్ల హెక్టార్లు
వైఎస్సార్ జిల్లా: 3.2 మిలియన్ల హెక్టార్లు

అమ్మకానికి ఎర్రబంగారం