
వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి దేవస్థానంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ గురువారం ఆలయంలో విచారణ జరిపారు. ఆలయంలో అక్రమాలు జరిగాయంటూ తెల్లాకుల మనోహర్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం డిప్యూటీ కమిషనర్ ఆలయానికి వచ్చి ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావును విచారించారు. దసరా పండగ తర్వాత వివరాలను అందిస్తామని ఆయన చెప్పగా.. నెల రోజులలోపు పూర్తి వివరాలు అందించాలని డీసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశ దరఖాస్తులకు గడువు పొడగింపు
కడప ఎడ్యుకేషన్ : జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13వతేదీ వరకూ గడువు పొడగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్కూటీ డిక్కీలో నగదు మాయం
– చాకచక్యంగా రూ.3.95 లక్షలు కొట్టేసిన దొంగ
ప్రొద్దుటూరు క్రైం : స్కూటీలో డిక్కీలో రూ.3.95 లక్షల నోట్ల కట్టలను ఓ దొంగ చాకచక్యంగా కొట్టేశాడు. ఇంటికెళ్లి డిక్కీ తెరవగా డబ్బు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న కల్లూరు రమణారెడ్డి రాజుపాలెం మండలంలోని టంగుటూరు ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సబితారెడ్డి అన్నమయ్య జిల్లాలో టీచర్‌గా పని చేస్తోంది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలోని తన సొంత స్థలాన్ని ఈ నెల 5న కడపకు చెందిన మల్లేశ్వరికి రూ.4,95,500లకు విక్రయించాడు. ఆ మొత్తాన్ని రమణారెడ్డి బ్యాంక్ అకౌంట్‌లో వేసింది. బుధవారం గాంధీ రోడ్డులోని ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లి ఆ డబ్బు రమణారెడ్డి డ్రా చేసుకున్నాడు. నోట్ల కట్టలను స్కూటీ డిక్కీలో పెట్టుకొని నేరుగా కొర్రపాడు రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. స్కూటీ కార్యాలయం ఎదుట పార్క్ చేసి స్థలం అమ్మిన పత్రాల్లో సంతకాలు పెట్టాడు. తిరిగి స్కూటీలో ఇంటికి వెళ్లి చేసుకోగా డిక్కీలోని నోట్ల కట్టల్లో రూ. 3.95,500 కనిపించలేదు. డిక్కీలో నగదు కాజేసి చాకచక్యంగా మళ్లీ డిక్కీ మూసివేశారని గుర్తించి అతను టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వేతనంతో కూడిన సెలవు దినం
కడప కోటిరెడ్డి సర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 12దీన దుకాణాలు, సంస్థలలోని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని వైఎస్సార్ కడప జిల్లా ఉప కార్మిక కమిషనర్ డి.వి.రంగరాజు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఈ నెల 1న మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నందున ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలి
కడప అర్బన్: జిల్లాలో పీ–4 విధానాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. పీ–4పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్ వీసీ ద్వారా గురువారం సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులతో మాట్లాడుతూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ జిల్లాలో గ్రామసభల ద్వారా నిర్వహిస్తున్న అసెస్‌మెంట్ సర్వే త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ కార్యక్రమం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి దుర్మరణం
చాపాడు: మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని పల్లవోలు గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబవరం శివ(31) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన అంబవరం శివ ట్రాక్టర్‌లో రాళ్లలోడుతో అన్నమయ్య జిల్లా రాయచోటికి వెళుతున్నాడు. చాపాడు మండలం పల్లవోలు గ్రామం వద్ద ప్రమాదశాత్తూ శివ క్రింద పడిపోయాడు. రోడ్డు ప్రక్కనే డివైడర్‌కు తల తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మృతుడు శివకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
పురుగుల మందు తాగి
రైతు ఆత్మహత్య
చిన్నమండెం : మండలంలోని కలిబండ గ్రామం కొల్లవాండ్లపల్లెకు చెందిన రైతు ఈశ్వర్‌రెడ్డి(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈశ్వర్‌రెడ్డి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.