
పొడదుప్పి మృతి
అట్లూరు : కుక్కల బారిన పడి పొడదుప్పి మృతిచెందిన సంఘటన అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. లంకమల్లేశ్వర అభయారణ్యం నుంచి ఎస్.వెంకటాపురం కాలనీ లోకి గురువారం ఉదయం ఓ పొడదుప్పి వచ్చింది. కుక్కలు దాడి చేస్తుండగా స్థానికులు గమనించి తప్పించారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీషర్ సురేష్‌కు సమాచారం అందించగా ఆయన వచ్చేలోపే పొడదుప్పి మృతిచెందింది. స్థానిక పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం ఖననం చేసినట్లు సెక్షన్ ఆఫీషర్ సురేష్ తెలిపారు.
గది అద్దెకిస్తే..
నగదు, నగలు అపహరణ
లింగాల : గది అద్దెకిస్తే.. నమ్మించి..నగదు, నగలు అపహరించిన సంఘటన లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన హసీనా, మాబాషా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. తమకు ఆశ్రయం కల్పించాలని పార్నపల్లి గ్రామానికి వచ్చారు. ఆ యువతీ యువకులు అరటి కాయలు మోసే కూలిపనులు చేస్తూ గత ఆరు మాసాలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇల్లు అద్దెక్కించిన మహిళ ఇంట్లో లేనిది చూసి గురువారం ఆమె ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో దాచిన రూ.1.10లక్షల నగదు, జత బంగారు కమ్మలు, మాటీలు, కాళ్ల గొలుసులు అపహరించి పారిపోయారు. ఈ విషయమై ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తితోపాటు పారిపోయిన హసీనా, మాబాషాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇల్లూరులో మహిళపై దాడి
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామంలో నివాసముంటున్న లక్ష్మీదేవిపై అదే గ్రామానికి చెందిన నరేంద్ర దాడి చేశాడు. కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్ వివరాల మేరకు.. వినాయకచవితిని పురస్కరించుకుని ఇల్లూరు గ్రామంలో చందా వసూలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన నరేంద్ర లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి చందా ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మాటా మాటా పెరిగి నరేంద్ర కర్ర తీసుకుని లక్ష్మీదేవిపై దాడి చేశాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాధితురాలిని పరామర్శించారు.
యువకుడు ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : విషద్రావణం తీసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. ఎస్‌ఐ రామక్రిష్ణ వివరాల మేరకు.. మోరగుడి గ్రామానికి చెందిన చాకలి జగన్ (33) మద్యానికి బానిసయ్యారు. కుటుంబ సమస్యలతో ఈ నెల 4న విష ద్రావణం తీసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. భార్య విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు.
దేవగుడిలో వివాహిత...
మండలంలోని దేవగుడి గ్రామానికి చెందిన వివాహిత రేవతి దేవి(40) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రేవతి దేవి గత కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకోని అత్మహత్య చేసుకుంది. భర్త బాబు ఖాజీపేటలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సినట్లు పోలీసులు తెలిపారు.