
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల భూ కబ్జాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. అట్లూరు మండల పరిధిలోని మాడపూరు రెవెన్యూ పొలం సర్వే నంబరు 1039లో 11.45 ఎకరాలు(పదకొండు ఎకరాల 45 సెంట్లు విస్తీర్ణం) ప్రభుత్వ భూమి ఉంది. ఇది మంచి సారవంతమైన భూమి కావడంతో పాటు బద్వేలు–ముత్తుకూరు రోడ్డుకు సమీపంలో ఉండడంతో ఆ భూమికి విలువ బాగా ఉంది. దీంతో ఆ భూమిపై కన్నేసిన కోనరాజుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు గత ఏడాది కబ్జాకు యత్నించారు. అయితే రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. డోజ ర్లు, జేసీబీ యంత్రాలతో ఆ భూమిని శనివా రం రాత్రి నుంచి చదును చేయడం మొద లుపెట్టారు. రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకుడితో కుమ్మక్కయ్యారో ఏమో అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం మండల ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.
హెచ్చరిక బోర్డును లెక్క చేయని వైనం..
మాడపూరు రెవెన్యూ పొలంలోని సర్వే నెంబరు 1039లో 11.45 ఎకరాలు విస్తీర్ణం ప్రభుత్వ స్థలమని, ఆక్రమిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్టు తమకు కాదనుకున్నారో ఏమో బోర్డును సైతం లెక్క చేయకుండా ఆక్రమించేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో కబ్జాకు గురైన స్థలాలను కబ్జాదారుల చెర నుండి విముక్తి కల్పిస్తామని ప్రగల్బాలు పలికారు నియోజక వర్గ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారి అనుచరులే బద్వేలు నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడడం పరిపాటిగా మారింది.
చర్యలు తీసుకుంటాం
మండల పరిధిలోని సర్వే నంబరు 1039లో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేసిన విషయమై తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ సెలవులో ఉండటంతో ఆర్‌ఐ రమణను ఫోన్‌లో వివరణ కోరగా ఆదివారం ఆ భూమిలో యంత్రాలతో చదును చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాల మేరకు సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లామన్నారు. అప్పటికే అక్కడ ఎవరూ లేరని భూమి మాత్రం చదును చేశారన్నారు. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అట్లూరు మండలంలో
అంతులేని ఆక్రమణలు
చోద్యం చూస్తున్న
రెవెన్యూ అధికారులు