కడప అగ్రికల్చర్: హమ్మయ్యా.. వరుణుడు కరుణించాడు. ఖరీప్ సీజన్‌కు ముందే పలకరించిన వరుణుడు ఆపై ముఖం చాటేశాడు. దీంతో సాగు చేసిన ఆరుతడి పంటలు ఎండముఖం పట్టాయి. రైతుల్లో ఆందోళన మొదలైంది. దాదాపు జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. ఈ తరుణంలో అల్పపీడనం కారణంగా రెండు రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు పడతూ వచ్చాయి. ఇక ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఫలితంగా ఆరుతడి పంటలకు ప్రాణం పొసినట్లయింది. జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ, కంది, పసుపు, మినుము వంటి ఆరుతడి పంటల సాగుకు అదును ఇదేనని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురిసిన వర్షంతోపాటు ఇంకా రెండు రోజుల పాటు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతోపాటు గతంలో సాగుచేసిన ఆరుతడి పంటలకు కూడా ఈవర్షం ఎంతో మేలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
కేసీ కాలువ నీటికితోడు...
జిల్లావ్యాప్తంగా ఇటీవల అధికారులు జీలుగలు, జనుములు, పెసలను పంపిణీ చేశారు. దీంతో చాలామంది రైతులు ప్రస్తుతం కురిసిన వర్షంతో వాటిని సత్తువ పంట కింద సాగు చేయనున్నారు. దీనికితోడు కేసీ కాలువకు నీరు కూడా విడుదలైయింది. ఇక కేసీ రైతులు సాగు పనులను ఆరంభించనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు కేసీ కెనాల్ కింద నారుమడులను సాగు చేస్తున్నారు. ఈ కేసీ నీటికి తోడుగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు మేలు జరగనుంది.
జిల్లాలో 7 వేల హెక్టార్లలో పంటలసాగు...
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇప్పటికే దాదాపు 7 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు.ఇందులో 16 వందల హెక్టార్లలో వరి, 717 హెక్టార్లలో మొక్కజోన్న, 827 హెక్టార్లలో మినుము, 871 హెక్టార్లలో వేరుశనగ, 70 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 358 హెక్టార్లలో సజ్జ, 30 హెక్టార్లలో సోయాబీన్, 2658 హెక్టార్లలో పత్తి, 16 హెక్టార్లలో చెరకు ఇలా జిల్లావ్యాప్తంగా 7 వేల హెక్టార్లలో వివిధ ఆరుతడి పంటలు సాగయ్యాయి.
● అల్పపీడనం కారణంగా జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఈ వర్షం ఆరుతడి పంటలకు ఎంతో మేలు. ప్రస్తుతం కేసీ కెనాల్‌కు నీరు వస్తోంది.ఇప్పటికే చాలామంది రైతులు నారుమడులను సాగు చేస్తున్నారు. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి
ఆరుతడి పంటలకు జీవం
కాశినాయన మండలంలో అత్యధికంగా 55 మి.మీ వర్షం
జిల్లా అంతటా వర్షం
జిల్లా అంతటా వర్షం