
సర్వేను అడ్డుకున్నారు
కడప రూరల్ : తన భూమి సర్వే చేయించుకునేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన క్రిష్ణయ్య ఆరోపించారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కడప మండలంలోని సర్వే నెంబరు 78–బీలో తన తండ్రి నరసరామయ్యకు 2.52 ఎకరాల స్థలం ఉందన్నారు. అందులో 2006లో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీకి 1.25 ఎకరాలను విక్రయించామని, మిగిలిన స్థలం సర్వే చేయించుకోవాలని కోర్టును ఆశ్రయించామని అన్నారు. కోర్టు నుంచి అనుమతి రావడంతో స్ధానిక రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లగా ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ వారు అడ్డగించారని ఆరోపించారు. మహమ్మదీయ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు జవాబ్ ఎక్యు మాట్లాడుతూ శుక్రవారం దీప, విజయ, మరికొందరు స్దలం వద్దకు వచ్చి దౌర్జన్యం చేయగా తాము ప్రశ్నించామని పేర్కొన్నారు. ఆ స్థలం నరసయ్య, నరసింహమూర్తిది కావడంతో తాము చట్ట ప్రకారం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తాము కూడా న్యాయ స్ధానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దారు నారాయణరెడ్డి మాట్లాడుతూ పోలీసుల పర్యవేక్షణలో వచ్చే వారంలో సర్వే చేస్తామన్నారు.
బీసీ వసతి గృహంలో విచారణకు ఆదేశం
సుండుపల్లె : మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహ భవనంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక అప్పన్నకుంటలో సర్వే నెంబర్–2169లోని ప్రభుత్వ స్థలంలో చెరువుకిందపల్లెకు చెందిన తిరుమలరెడ్డి శివారెడ్డి భవనం నిర్మించి బీసీ బాలల వసతి గృహానికి అద్దెకు ఇచ్చారని బీజేపీ నాయకుడు వెంకటరామరాజు మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకుని ఇప్పటివరకూ తీసుకున్న అద్దె రికవరీ చేయాలని ఆయన కోరారు. వెంటనే విచారించాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలందాయి.
కాన్వకేషన్‌కు రావాలంటూ గవర్నర్‌కు ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్‌కు అనుమతి ఇవ్వాలని, కులపతి హోదాలో కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్‌ను వైవీయూ ఇన్‌చార్జి వీసీ అల్లం శ్రీనివాసరావు కోరారు. విజయవాడ రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ను శుక్రవారం ఆయన కలిసి మొక్క అందజేసి దశ్శాలువాతో సత్కరించారు. యోగి వేమన విశ్వ విద్యాలయం గురించి గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ స్పందిస్తూ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కాన్వకేషన్ నిర్వహించుకోవాలని, ఆయా తేదీల వివరాలు తమ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఉపకులపతి వెంట విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ.కృష్ణారావు ఉన్నారు.